Harish Rao: కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి అంశంపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao comments on attack on kotha prabhakar reddy
షార్ట్స్‌లో చూడండి
కొంతమంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి... ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని చేయని వ్యక్తి అని చెప్పారు. గురువారం ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్‌లో వచ్చి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ వేసిన అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ... ఆ రోజు ఒక గంట ఆలస్యమైతే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మొండి కత్తి, కోడి కత్తి అంటూ హేళన చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు దుబ్బాక అంటే చాలా ప్రేమ ఉందన్నారు.

డీకే శివకుమార్ ఇక్కడకు వచ్చి తాము కర్ణాటకలో ఐదు గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ ఇక్కడ మనం 24 గంటలు ఇస్తున్నామన్నారు. ఇక రేవంత్ రెడ్డి అయితే మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్‌లో పెట్టాల్సిన పరిస్థితి, రాత్రి బావి వద్ద పడుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవన్నారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిస్తే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు. కొంతమంది దద్దమ్మలు కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు చేతకాని దద్దమ్మలు అన్నారు. దుబ్బాకకు డబ్బుల సంచులు వస్తున్నాయట... అలాంటి వారిని మీ గ్రామాల్లోకి రానీయవద్దని దుబ్బాక ప్రజలకు సూచించారు. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డిని 50వేల మెజార్టీతో గెలిపించాలన్నారు. 26వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాకకు వస్తున్నారన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. అధికారంలోకి వచ్చేది లేదన్నారు.
Go Back to Shorts
Harish Rao
BRS
kotha prabhakar reddy
Telangana Assembly Election

More Telugu News