World Cup: మిగిలిన ఒక్క సెమీస్ బెర్తు కోసం త్రిముఖ పోరు... శ్రీలంకపై టాస్ గెలిచిన న్యూజిలాండ్

  • వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ × శ్రీలంక
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • టోర్నీలో ఇప్పటికే సెమీస్ చేరిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
  • మిగిలిన ఒక బెర్తు కోసం పోటీ పడుతున్న న్యూజిలాండ్, ఆఫ్ఘన్, పాకిస్థాన్
New Zealand won the toss against Sri Lanka

వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. సెమీస్ బెర్తు దక్కాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు ముగ్గురు పేసర్లతో బరిలో దిగుతోంది. లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ స్థానంలో లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక జట్టులోనూ ఒక మార్పు చోటుచేసుకుంది. పేసర్ కసున్ రజిత స్థానంలో చామిక కరుణరత్నేకు తుది జట్టులో స్థానం కల్పించారు. 

సెమీస్ ముఖచిత్రం ఇలా ఉంది...

కాగా, న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు టోర్నీలో 8 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో 8 పాయింట్లు సాధించింది. అటు, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు కూడా 8 పాయింట్లతో సెమీస్ రేసులో ఉన్నాయి. ఇవాళ న్యూజిలాండ్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుండగా, ఈ పోరులో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉంటాయి. 

రేపు ఆఫ్ఘనిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు గెలిస్తే ఆ జట్టు ఖాతాలోనూ 10 పాయింట్లు ఉంటాయి. ఎల్లుండి (నవంబరు 11) పాకిస్థాన్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ ను ఇంగ్లండ్ తో ఆడనుంది. ఇందులో పాక్ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉంటాయి. అప్పుడు న్యూజిలాండ్, ఆఫ్ఘన్, పాక్ జట్లలో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. 

ఈ మూడు జట్లలో ఏది తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిపోయినా సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరిన సంగతి తెలిసిందే.

More Telugu News