Sivasakti Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్తా టాలెంట్ కు అనుపమ్ ఖేర్ ఫిదా

Anupam Kher visits MM Keeravani father Sivasakti Datta house
  • శివశక్తి దత్తా నివాసానికి వచ్చిన అనుపమ్ ఖేర్
  • అక్కడి చిత్రపటాలు చూసి ముగ్ధుడైన వైనం
  • అవి శివశక్తి దత్తా గీశారని తెలిసి నమ్మలేకపోయిన అనుపమ్ ఖేర్
  • వెంటనే శివశక్తి దత్తా కాళ్లకు నమస్కరించిన నటుడు
టాలీవుడ్ లో కీరవాణి, రాజమౌళి కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. వాళ్లింట్లో ఎవరిని కదిలించినా, ఏదో ఒక టాలెంట్ కనిపిస్తుంది. ఇక ఇంట్లో అందరూ కళాకారులే ఉండడం అనేది అరుదైన విషయం. తాజాగా, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా చిత్రలేఖనం టాలెంట్ చూసిన బాలీవుడ్ నట దిగ్గజం అనుపమ్ ఖేర్ ఆశ్చర్యానికి గురయ్యారు. 

శివశక్తి దత్తా లిరిక్ రైటర్, స్టోరీ రైటర్ మాత్రమే కాదు, చేయి తిరిగిన చిత్రకారుడు. ఆయన దేవుళ్ల పెయింటింగులను వేసి తన ఇంట్లో అందంగా అలంకరించుకున్నారు. శివశక్తి దత్తా నివాసానికి వచ్చిన అనుపమ్ ఖేర్ ఆ చిత్రాల్లో దివ్యత్వం ఉట్టిపడడం చూసి నమ్మలేకపోయారు. వెంటనే శివశక్తి దత్తా పాదాలకు నమస్కరించి తన ఆనందాన్ని వెలిబుచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను అనుపమ్ ఖేర్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. శివశక్తి దత్తా నివాసంలోని ప్రతి చోట ఏదో ఒక పెయింటింగ్ ఉండగా, వాటన్నింటినీ అనుపమ్ ఖేర్ తన కెమెరాలో బంధించారు.

"శివశక్తి దత్తా గారి నివాసంలో నేను గడిపింది అరగంటే అయినా, ఆ సమయం ఎంతో విలువైనదిగా భావిస్తాను. తాను గీసిన ఓ చిత్రపటాన్ని ఆయన నాకు బహూకరించారు. అది నా అదృష్టంగా భావిస్తాను. ప్రతి చోట ఉండేది ఆ దేవుడే, కానీ శివశక్తి దత్తా గారి ఇంటికి వెళ్లి చూస్తే ఓ పుణ్యక్షేత్రంలా అనిపించింది. అది ఇల్లు కాదు... ఓ దేవాలయం" అని పేర్కొన్నారు. 

కాగా, శివశక్తి దత్తా నివాసానికి అనుపమ్ ఖేర్ వచ్చిన సందర్భంగా కీరవాణి అక్కడే ఉన్నారు. అనుపమ్ ఖేర్ కు తన తండ్రి నివాసంలోని చిత్ర పటాలను దగ్గరుండి చూపించారు. 

శివశక్తి దత్తా వయసు ప్రస్తుతం 92 ఏళ్లు. ఆయన ఈ వయసులో కూడా పాటలు రాస్తున్నారంటే నమ్మశక్యం కాదు. యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రానికి శివశక్తి దత్తా పాట రాస్తున్నట్టు తెలుస్తోంది.
Sivasakti Datta
Anupam Kher
Keeravani
Tollywood
Bollywood

More Telugu News