Telangana Assembly Election: పట్టుబడిన నగదు కానుకలు అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ కీలక నిర్ణయం

Freebies to be added to election expenses of individual contestants
  • నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఖాతాకు జమ చేయాలని ఈసీ ఆదేశాలు
  • అక్రమ మద్యం, డ్రగ్స్ కట్టడికి ఆధునికంగా ఆలోచించాలని ఈసీ సూచన
  • హైదరాబాద్‌లో అధికారులతో సమావేశమైన ఈసీ బృందం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలలో పట్టుబడిన నగదు, కానుకలపై ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు, అధికారుల తనిఖీల్లో పట్టుబడిన నగదు, కానుకల విలువను ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ ఆదేశాలను జారీ చేసింది. నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఖాతాకు జమ చేయాలని సూచించింది. తద్వారా అక్రమ మద్యం, డ్రగ్స్ కట్టడికి ఆధునికంగా ఆలోచించాలని ఈసీ చెబుతోంది. మునుగోడు ఉప ఎన్నిక అనుభవాల నేపథ్యంలో గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల నిర్వహణ, తనిఖీలు సహా ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచించింది.

మరోవైపు, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ బృందం హైదరాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించింది. తనిఖీలు, స్వాధీనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటిష్ఠ నిఘా ఉండాలని, తనిఖీలు ముమ్మరంగా జరగాలని, చెక్ పోస్టుల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లతో ఈసీ అధికారులు వేర్వేరుగా సమావేశమయ్యారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌తోనూ సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధతపై ఆరా తీశారు. అంశాలవారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు.
Telangana Assembly Election
State Election Commission
Telangana

More Telugu News