Nagam Janardhan Reddy: నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి కేటీఆర్, హరీశ్ రావు... బీఆర్ఎస్ లోకి రావాలంటూ ఆహ్వానం

  • కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నాగం జనార్దన్ రెడ్డి
  • సీఎం కేసీఆర్ సూచన మేరకు నాగం నివాసానికి మంత్రులు
  • నాగంతో చర్చలు
  • బీఆర్ఎస్ లో చేరేందుకు నాగం సుముఖత
  • సీఎం కేసీఆర్, నాగం చిరకాల మిత్రులని కేటీఆర్ వెల్లడి
  • నాగం జన్మతః తెలంగాణ వాది అని వ్యాఖ్యలు
KTR and Harish Rao invites Nagam Janardhan Reddy into BRS Party

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. ఇది జరిగిన కాసేపటికే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు హైదరాబాదులో నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగం నివాసంలో కీలక చర్చ జరిగింది. 

ఈ భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లో చేరాలన్న తమ ఆహ్వానం పట్ల నాగం జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే నాగంను కలిశామని వివరించారు. సీఎం కేసీఆర్, నాగం మధ్య 40 ఏళ్ల స్నేహం ఉందని, వారిద్దరూ చిరకాల మిత్రులని తెలిపారు. 

బీఆర్ఎస్ లో చేరడం పట్ల సుముఖత వ్యక్తం చేసినందుకు నాగంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు. నాగం, ఆయన అనుచరులకు బీఆర్ఎస్ లో కచ్చితంగా సముచిత స్థానం, గౌరవం లభిస్తాయని స్పష్టం చేశారు. నాగం జన్మతః తెలంగాణవాది అని కేటీఆర్ కొనియాడారు.

More Telugu News