నీకు ఏ కారు కావాలంటే అది తీసుకో తల్లీ... పారా ఆర్చర్ ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా
- పారా ఆసియా క్రీడల్లో శీతల్ దేవి ప్రతిభ
- ఆర్చరీలో స్వర్ణం
- రెండు చేతులు లేకపోయినా అస్త్ర విన్యాసం
- ఫైనల్లో అద్భుత ప్రతిభతో విజేతగా నిలిచిన జమ్మూ కశ్మీర్ బాలిక
జమ్మూ కశ్మీర్ లోని కిస్త్వాడ్ జిల్లా లోయిధర్ గ్రామం ఆమె స్వస్థలం. పారా ఆసియా క్రీడల్లో మహిళల ఇండివిడ్యువల్ కాంపౌండ్ కేటగిరీలో శీతల్ స్వర్ణం చేజిక్కించుకుని, రెండు చేతులు లేకుండా ఆర్చరీ స్వర్ణం నెగ్గిన తొలి మహిళా ఆర్చర్ గా అరుదైన ఘనత సాధించింది.
ఆ బాలిక నైపుణ్యానికి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అంతటివాడే అచ్చెరువొందారు. ఆయన ఎక్స్ లో స్పందించిన తీరు చూస్తే ఎంతలా ముగ్ధులయ్యారో అర్థమవుతుంది.
"శీతల్ దేవిని చూశాక... ఇక నేను ఎప్పటికీ నా జీవితంలోని చిన్న చిన్న సమస్యల పట్ల ఫిర్యాదు చేయబోను. శీతల్ దేవీ... నువ్వు మా అందరికీ గురువు తల్లీ. మా కంపెనీ తయారుచేసే ఏ కారు కావాలంటే అది తీసుకోమ్మా. ఆ కారును నీకు బహూకరిస్తాం. అంతేకాదు, నీకు అనుగుణంగా ఆ కారులో మార్పులు చేర్పులు కూడా చేయిస్తాం" అని ఆనంద్ మహీంద్రా భావోద్వేగాలతో ట్వీట్ చేశారు.