Cricket: విమర్శించడం చాలా సులభం.. ఎవరైనా అది చేయగలరంటున్న పాక్ వైస్ కెప్టెన్

Criticising Is The Easiest Thing says Pakistan vice captain Shadab Khan
  • సౌతాఫ్రికాతో నేడు చెపాక్ లో తలపడనున్న పాకిస్థాన్
  • దాయాది జట్టుకు ఇది చావో రేవో తేల్చుకునే మ్యాచ్
  • ఈ మ్యాచ్ లో ఓడితే వరల్డ్ కప్ టోర్నీ నుంచి బాబర్ సేన ఇంటికే.. 

ప్రస్తుత వరల్డ్ కప్ మ్యాచ్ లలో పేలవమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న పాకిస్థాన్ జట్టుపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ లో అయితే అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. ఓ మాజీ ఆటగాడైతే ఏకంగా జట్టులోని సభ్యుల తిండి విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తమ జట్టుపై కురుస్తున్న విమర్శల వర్షంపై పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ తాజాగా స్పందించారు. ‘విమర్శలకేముంది.. చాలా సులభం. ఎవరైనా విమర్శించగలరు. అయితే, ఈ విమర్శలతో ఎలాంటి ఉపయోగం లేదు, దేనినీ అవి మార్చలేవు. మాకు రాసిపెట్టుంది జరుగుతుందంతే’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.

సౌతాఫ్రికాతో మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. తప్పకుండా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఆడే ముందు జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని షాదాబ్ పేర్కొన్నారు. అయితే, ఇలాంటి పరిస్థితి తమకు కొత్త కాదని, గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ పరిస్థితిని ఎదుర్కొని అద్భుత ప్రదర్శన చేశామని ఆయన గుర్తుచేశారు. సౌతాఫ్రికాతో మ్యాచ్ విషయంలో తాము కొత్తగా కోల్పోయేదేమీ ఉండదనే ఆలోచనతోనే బరిలోకి దిగుతామని వివరించారు. ఈ మ్యాచ్ లో ఓడిపోతే ప్రపంచ కప్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వస్తుందనేది జట్టులోని ప్రతీ ఆటగాడికీ తెలుసని, గెలవడం తప్ప తమ ముందు మరో మార్గంలేదని గుర్తించామని షాదాబ్ పేర్కొన్నారు. శుక్రవారం జరిగే మ్యాచ్ లో తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని షాదాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News