chalamala krishnareddy: మునుగోడు టిక్కెట్ నాదే.. రాజగోపాల్ రెడ్డి నాకు వదిలేయాలి: చలమల కృష్ణారెడ్డి

chalamala krishna reddy on munugod ticket
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్న చలమల
  • కానీ టిక్కెట్ తనకే వస్తుందని చలమల కృష్ణారెడ్డి ధీమా
  • రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకుడు కాబట్టి మరోచోటు నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి
  • పార్టీ అధిష్ఠానం నుంచి మునుగోడు టిక్కెట్‌పై తనకు గుడ్ న్యూస్ వస్తుందని వెల్లడి

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై మునుగోడుకు చెందిన ఆ పార్టీ నేత చలమల కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి వర్గం నేతగా ఉన్న ఆయన గత మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ, ఆ తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని అధిష్ఠానం పోటీలోకి దింపింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోనే ఉంటే ఈసారి పాల్వాయి స్రవంతి లేదా చలమల కృష్ణారెడ్డికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి ఆయన రాకను స్వాగతిస్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డిని తాను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. కానీ ఈసారికి మునుగోడును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా కిందపడకుండా తాను కాపాడానన్నారు. ఇందుకు తనకు కోమటిరెడ్డి సహకరించాలని కోరుతున్నానన్నారు. మునుగోడు కాంగ్రెస్ టిక్కెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా బలమైన నాయకుడు అని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవగలిగిన నాయకుడు అన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ మరో సీటు కేటాయించాలని కోరారు. ఆయన పార్టీలోకి వస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుందని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ 12 స్థానాలకు పన్నెండు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి, కమ్యూనిస్టుల సహకారంతో మునుగోడులో తాను గెలుస్తానన్నారు. మునుగోడు సీటు ఎవరికో పోతుందనే ఆందోళన తనకు లేదన్నారు. ఎందుకంటే కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీకి పని చేశానన్నారు. కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చానన్నారు.

గత ఉప ఎన్నికల సమయంలోనే తనకు టిక్కెట్ వస్తుందని భావించానని, అయితే పార్టీ పెద్దలు వచ్చేసారి ఇస్తామని తనకు నచ్చజెప్పారన్నారు. ఎల్బీ నగర్, యాదాద్రి నుంచి పోటీ చేయమంటే తాను అంగీకరించలేదని, మునుగోడు నుంచి పోటీ చేయడమే తనకు కావాలన్నారు. అవసరమైతే ఖాళీగా ఉంటాను కానీ ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసేది లేదన్నారు. మునుగోడు సీటు తనదే అని, ఈరోజు ఉదయం కూడా అధిష్ఠానం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అధైర్యపడవద్దని తనకు చెప్పారని, ఈ రోజు సాయంత్రానికి సీటు విషయంలో తనకు గుడ్ న్యూస్ చెబుతానని హామీ ఇచ్చారన్నారు. ఆ గుడ్ న్యూస్ ఈ రోజు వినాలనుకుంటున్నానన్నారు.

మునుగోడు టిక్కెట్ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారనే అనుమానం తనకు కించిత్ కూడా లేదన్నారు. కాబట్టి ఆయనకు టిక్కెట్ ఇస్తే కార్యాచరణ ఏమిటనే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెస్ తనకు మునుగోడులో అవకాశం ఇస్తుందన్నారు. తాను కేవలం మునుగోడు నాయకుడిని మాత్రమేనని, కానీ రాజగోపాల్ రెడ్డి రాష్ట్రస్థాయి నాయకుడు కాబట్టి ఆయన ఎక్కడైనా పోటీ చేయవచ్చునన్నారు. అన్నా.. పెద్దమనసుతో మునుగోడును ఈసారి నాకు వదిలేయండి... ఇందుకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి చలమల కృష్ణారెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News