World Cup: వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్

  • వరల్డ్ కప్ లో ఇవాళ దక్షిణాఫ్రికా × ఇంగ్లండ్
  • 229 పరుగుల భారీ తేడాతో ఓడిన ఇంగ్లండ్
  • 400 పరుగుల లక్ష్యఛేదనలో 170కి ఆలౌట్
England registers biggest lose in world cups

గత వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో మరోసారి దారుణంగా విఫలమైంది. ఇవాళ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంగ్లండ్ జట్టుకు ఇది అత్యంత ఘోర పరాజయం. 

ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఛేదనకు మొగ్గు చూపింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు... క్లాసెన్ (109) సెంచరీ, హెండ్రిక్స్ (85), వాన్ డర్ డుస్సెన్ (60), యన్ సెన్ (75 నాటౌట్) అర్ధసెంచరీలతో అతి భారీ స్కోరు నమోదు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగులు చేసింది. కెప్టెన్ మార్ క్రమ్ 42 పరుగులు సాధించాడు.

ఇక, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఆటతీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బాగుంటుందేమో! జానీ బెయిర్ స్టో (10), డేవిడ్ మలాన్ (6), జో రూట్ (2), బెన్ స్టోక్స్ (5), కెప్టెన్ జోస్ బట్లర్ (15), హ్యారీ బ్రూక్ (17) వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఇంగ్లండ్ 22 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. 

టెస్టుల్లోనూ ధనాధన్ బ్యాటింగ్ ను తీసుకువచ్చి, క్రికెట్ కు సరికొత్త ఒరవడి చూపించిన ఇంగ్లండ్ జట్టేనా ఇలా ఆడింది అని సందేహం కలిగించేలా పరమ చెత్త ఆటతీరు కనబర్చింది. చివర్లో మార్క్ ఉడ్ (43 నాటౌట్), గస్ ఆట్కిన్సన్ (35) పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. మార్క్ ఉడ్ 17 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. ఆట్కిన్సన్ 7 ఫోర్లు కొట్టాడు. 

ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగే కాదు... బౌలింగ్, ఫీల్డింగ్ కూడా అత్యున్నత ప్రమాణాలతో కొనసాగాయి. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ 3, ఎంగిడి 2, యన్ సెన్ 2, రబాడా 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీశారు.

More Telugu News