Male Contraceptive: ప్రపంచంలోనే తొలిసారి.. పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్ అందుబాటులోకి.. అత్యంత అరుదైన ఘనత సాధించిన ఐసీఎంఆర్

  • ఏడేళ్ల పరిశోధన అనంతరం ఫలితాలు వెల్లడించిన ఐసీఎంఆర్
  • ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే 13 ఏళ్లపాటు ప్రభావం
  • 99 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్న రివెర్సిబుల్ ఇంజెక్షన్
  • నో సైడ్ ఎఫెక్ట్స్.. పూర్తిగా సురక్షితం
Good News For males ICMR  Successfully Tested Contraceptive

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే తొలిసారి పురుషుల కోసం ప్రత్యేకంగా ఓ గర్భనిరోధక ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. సుధీర్ఘకాలం పాటు అవాంఛిత గర్భాన్ని అడ్డుకునే ఈ ఇంజెక్షన్‌కు రివర్సిబిలిటీ ఉండడం మరో విశేషం. అంటే పిల్లలు కావాలనుకున్నప్పుడు దీనివల్ల ఎలాంటి అడ్డంకి ఉండదన్నమాట. అయితే, దీనిని రివెర్సిబుల్ ఎలా చేస్తారన్న విషయాన్ని ఐసీఎంఆర్ వెల్లడించలేదు. 

ఏడేళ్లపాటు 303 మంది పురుష వలంటీర్లపై పరిశోధనలు జరిపిన అనంతరం ఐసీఎంఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ పరిశోధనలో దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వెల్లడి కాలేదని పేర్కొంది. అధ్యయన ఫలితాలు ఇంటర్నేషనల్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ ఆండ్రాలజీలో ప్రచురితమయ్యాయి. 

పరిశోధనల్లో భాగంగా 25-40 ఏళ్ల మధ్యనున్న వలంటీర్లకు 60 మిల్లీ గ్రాముల ఆర్ఐఎస్‌యూజీ (రివెర్సిబుల్ ఇన్‌హిబిటేషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్)ను ఇచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఇంజెక్షన్ 99.02 శాతం గర్భాన్ని అడ్డుకుంటున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, పూర్తిగా సురక్షితమని, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వివరించారు. ఈ ఇంజెక్షన్ బహిరంగ మార్కెట్లోకి వస్తే వేసెక్టమీ చేయించుకోవాలనుకునే పురుషులకు కోత బాధ తప్పినట్టే.

More Telugu News