Telugudesam: హోం మంత్రి ఎదురుగా ఉన్నా పార్టీ కండువా తీయనన్న టీడీపీ వీరాభిమాని!

TDP staunch supporter proudly displays his appreciation for party infront of AP minister in East godavari
  • తూర్పు గోదావరి జిల్లాలో హోం మంత్రి వనిత ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం
  • మంత్రి తన ఇంటికి వస్తున్నారని తెలిసి టీడీపీ కండువాతో బయటకొచ్చిన వీరాభిమాని
  • మంత్రి తండ్రి కూడా తనకు తెలుసని వ్యాఖ్య
  • పార్టీపై ఆయనకున్న అభిమానానికి ఆశ్చర్యపోయిన మంత్రి  
ఏపీ హోం మంత్రి వనితకు ఓ టీడీపీ వీరాభిమాని పార్టీ కండువా కప్పుకునే ఎదురుపడ్డారు. మంత్రి అనుచరులు, పోలీసులు కండువా తొలగించాలని విజ్ఞప్తి చేసినా ఆయన వినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఆదివారం వైరల్‌గా మారింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడుకు చెందిన 80 ఏళ్ల వల్లభని సోమరాజు టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం. పార్టీపై తనకున్న అభిమానానికి గుర్తుగా నిత్యం టీడీపీ కండువా కప్పుకునే కనిపిస్తారు. 

కాగా, శనివారం సాయంత్రం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి వనిత తన ఇంటికి వస్తున్నారని తెలిసి సోమరాజు టీడీపీ ఉత్తరీయం వేసుకుని బయటకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు, మంత్రి సహచరులు కండువా తొలగించాలన్నా ఆయన కుదరదని కరాఖండీగా చెప్పేశారు. ఈలోపు మంత్రి వచ్చి పథకాలను వివరిస్తుండగా.. ‘‘మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. టీడీపీ పుట్టినప్పటినుంచీ పరిచయాలు ఉన్నాయి’ అని చెప్పారు. టీడీపీపై ఆయన అభిమానానికి ఆశ్చర్యపోయిన మంత్రి నవ్వుకుంటూ పక్కింటికి వెళ్లిపోయారు. కాగా, మంత్రి తండ్రి కూడా ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నారని, క్రమశిక్షణ కలిగిన నాయకత్వం టీడీపీతోనే సాధ్యమని మీడియాకు స్పష్టం చేశారు.
Telugudesam
Taneti Vanita
YSRCP
East Godavari District

More Telugu News