Nara Rohith: చంద్రబాబు విషయంలో ఇకనైనా మనుషుల్లా ప్రవర్తించండి: నారా రోహిత్

Nara Rohith fires on govt over Chandrababu health issue
  • చంద్రబాబు ఆరోగ్యంపై నారా రోహిత్ స్పందన
  • 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు అమానుషం అంటూ ఆగ్రహం
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వెల్లడి
  • చంద్రబాబును ప్రజలే కాపాడుకుంటారని ఉద్ఘాటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఇటీవలి పరిణామాలపై నారా రోహిత్ తీవ్రస్థాయిలో స్పందించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషం అని విమర్శించారు. తన రాజకీయ జీవితం అంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని పేర్కొన్నారు. 

"చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేక, భౌతికంగా ఇబ్బంది పెడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు.

డీహైడ్రేషన్ తో బాధపడుతున్న చంద్రబాబుకు తక్షణ వైద్య సాయం అవసరమని డాక్టర్లు చెపుతున్నా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. డాక్టర్లు ఇచ్చిన నివేదికను బయటపెట్టకపోవడంలో ఉన్న ఆంతర్యం కూడా ప్రజలకు అర్థమైంది. చర్మవ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు పట్ల ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అవహేళన వ్యాఖ్యలు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 

74 ఏళ్ల వయసున్న ఆయనకు కనీస సౌకర్యాలు కల్పించడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రాకపోవడాన్ని ఏమనాలి? న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చేంతవరకు వసతుల ఏర్పాటు కోసం వేడుకోవాలా?" అంటూ నారా రోహిత్ ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ప్రజల సంపద అని, ఆయనను ప్రజలే రక్షించుకుంటారని స్పష్టం చేశారు. మహోన్నత స్థాయి కలిగిన వ్యక్తిని ఇబ్బందులకు గురిచేస్తే సమాజం క్షమించదన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా కక్షలు, కార్పణ్యాలు వీడి మనుషుల్లా ప్రవర్తించండి... చంద్రబాబుకు అవసరమైన వైద్యసాయం అందించండి అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Nara Rohith
Chandrababu
Health
TDP
YSRCP

More Telugu News