US President: ఇంతటి దారుణాలను చూడాల్సి వస్తుందనుకోలేదు: జో బైడెన్

Have confirmed pictures of terrorists beheading children says Biden
  • చిన్నారుల శిరచ్ఛేదంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
  • ఐసిస్ దారుణాలకు మించి ఉన్నాయన్న బైడెన్
  • ఉగ్రవాదాన్ని క్షమించేది లేదని ప్రకటన
ఉగ్రవాదులు చిన్నారుల తలలను తెగ నరుకుతున్న ఫొటోలను తాను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ సాగిస్తున్న ఉగ్రదాడులపై ఆయన స్పందించారు. ‘‘దారుణమైన కాఠిన్యానికి ఈ దాడులు నిదర్శనం. చిన్నారుల శిరచ్ఛేదనం ఫొటోలను ధ్రువీకరించాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని అన్నారు. గత శనివారం తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై ముప్పేట దాడికి దిగడం తెలిసిందే. ఈ దాడి యూదులకు నాటి హోలోకాస్ట్ తర్వాత అంతటి ప్రాణాంతకమైన రోజుగా బైడెన్ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ అధీనంలోని యూరప్ లో యూదులపై జరిగిన మారణహోమాన్ని హోలోకాస్ట్ గా చెబుతారు. 

యూదులకు వ్యతిరేకంగా సాగించిన మారణహోమం, సహస్రాబ్దాల పాటు వ్యతిరేకత తాలూకూ జ్ఞాపకాలను ఈ దాడి మరోసారి గుర్తుకు తెచ్చినట్టు  బైడెన్ పేర్కొన్నారు. ‘‘హమాస్ కేవలం ఉగ్రవాదాన్నే కాదు, ఈ ప్రపంచానికి కీడును తీసుకొచ్చింది. ఐసిస్ దారుణ ఉదంతాలను మించి హమాస్ చర్యలు ఉన్నాయి’’ అని బైడెన్ పేర్కొన్నారు. ఎంతో మంది ఇజ్రాయెల్ నేతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నేతలతో తాను సంప్రదింపులు జరిపినట్టు బైడెన్ చెప్పారు. హమాస్ హత్య చేసిన వారిలో 22 మంది అమెరికన్ పౌరులు కూడా ఉన్నట్టు తెలిపారు. ఉగ్రవాదాన్ని క్షమించేది లేదని చెబుతూనే.. ఇజ్రాయెల్ లో పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సునిశితంగా పర్యవేక్షిస్తుంటామని ప్రకటించారు.
US President
Joe Biden
reaction
Hamas attack
Israel
beheading children

More Telugu News