Bonda Uma: హెరిటేజ్ కోసం అలైన్ మెంట్ మార్చారన్నది పచ్చి అబద్ధం: బొండా ఉమా

  • ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో బొండా ఉమ ప్రెస్ మీట్
  • ఇందులో లోకేశ్ పాత్ర ఏముందన్న టీడీపీ నేత
  • వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం
Bonda Uma slams YCP leaders over inner ring road issue

నాడు ప్రజలందరి అభిప్రాయంతో వారి అభీష్టంతో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబునాయుడు, ఆ మహానగరం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ లో రాజధాని ప్రాంతంలో ఎలాంటి  రవాణా సమస్యలు రాకూడదని భావించి, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలనే ఆలోచన చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ వెల్లడించారు. 

తర్వాత కాలంలో అది కేవలం కాగితాలకే పరిమితమైందని, అలాంటి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బొండా ఉమ విలేకరులతో మాట్లాడారు.


లోకేశ్ దే ప్రధాన భూమిక అని దుష్ప్రచారం చేస్తున్నారు

జగన్ రెడ్డి, అతని నీతిమాలిన ప్రభుత్వం... వేయని ఇన్నర్ రింగ్ రోడ్ గురించి నోటికొచ్చినట్టు దుష్ప్రచారం చేస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను హెరిటేజ్ సంస్థ భూముల కోసం మార్చారని, లోకేశ్ ఈ వ్యవహారంలో ప్రధాన భూమిక పోషించాడని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అదంతా పచ్చి అబద్ధం. 

హెరిటేజ్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం ఎప్పుడో 2014లో అమరావతి ప్రాంతంలోని కంతేరులో 9.17 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. భూములు కొనే సమయానికి అప్పుడు రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన నిర్ణయం హెరిటేజ్ సంస్థ బోర్డ్ మీటింగ్ లో తీసుకుంది. 

హెరిటేజ్ సంస్థ కొన్న భూమిలో దాదాపు పావు వంతు భూమి 2.15 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంలో పోయిందని, ఆ రోడ్ అలైన్ మెంట్ ను బట్టే తెలుస్తోంది.  నిజంగా జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నట్టు హెరిటేజ్ భూములు కోసమే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మారిస్తే... చూస్తూ చూస్తూ ఆ సంస్థ 2 ఎకరాల భూమి పోగొట్టుకుంటుందా?

లోకేశ్ అధికారంలో ఉండి ఆ సంస్థకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, సంస్థ భూములు పోయేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను అమలు చేసేవాడా? కాబట్టి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వారికి ఊడిగం చేసే నీలి మీడియా చేస్తున్న ప్రచారమంతా అవాస్తవమే.

నారాయణ, లింగమనేని ఆ భూములు ఎప్పుడో కొన్నారు

మాజీ మంత్రి నారాయణకు, లింగమనేని సంస్థకు ఉన్న భూముల విలువ పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ తయారు చేశారంటున్న వాదన కూడా పచ్చి అబద్ధం. మాజీ మంత్రి నారాయణ, ఆ సంస్థ ఎప్పుడో 1980ల్లోనే విజయవాడ-గుంటూరు మధ్యలో భూములు కొన్నారు. అవేమీ రాష్ట్ర విభజనకు ముందో, తర్వాతో కొన్నవి కావు. కానీ వారి భూములకు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కు ఈ ప్రభుత్వం ముడి పెట్టి విషప్రచారం చేస్తోంది.

ఆళ్ల ఫిర్యాదు చేశాకే వైసీపీ ప్రభుత్వానికి ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి కనిపించింది

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 27-04-2022న సీఐడీకి ఒక తప్పుడు ఫిర్యాదు చేశాడు. దాన్ని పట్టుకొని జగన్ సర్కార్ లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి, అక్రమాలని దుష్ర్చచారానికి తెర లేపింది. వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు స్వీకరించినప్పటి నుంచీ టీడీపీ నేతల పేర్లు, మాజీ మంత్రుల పేర్లు ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలోకి లాగుతూనే ఉన్నారు. చివరకు  చంద్రబాబు, లోకేశ్ ల పేర్లు తీసుకొచ్చి... దానిలో వారిద్దరూ తప్పు చేశారు అని నీతిమాలిన ప్రచారం చేస్తున్నారు. 

ప్రభుత్వ శైలిపై లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేస్తే, దానికి సంబంధించి జరిగిన వాదనల్లో వైసీపీ ప్రభుత్వమే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతో లోకేశ్ కు సంబంధం లేదని... 41ఏ నోటీసులు ఇచ్చాకే ఆయన్ని విచారణకు పిలుస్తామని నాలుక మడతేసింది. 

జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు, వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పిచ్చికూతలు కూయడం... న్యాయస్థానాలు ప్రశ్నించగానే తేలుకుట్టిన దొంగల్లా తప్పుకోవడం. ఇదీ వీళ్ల వరస... అంటూ బొండా ఉమ మండిపడ్డారు.

More Telugu News