New Zealand: కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీల మోత... వరల్డ్ కప్ లో ఘనంగా బోణీ చేసిన న్యూజిలాండ్

New Zealand makes good start in world cup after beating England by 9 wickets
  • నేటి నుంచి ఐసీసీ వరల్డ్ కప్
  • తొలి మ్యాచ్ లో కివీస్ 9 వికెట్ల తేడాతో విజయం
  • ఇంగ్లండ్ స్కోరు 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు
  • 36.2 ఓవర్లలో కొట్టేసిన న్యూజిలాండ్

ఐసీసీ వరల్డ్ కప్-2023 వేటను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ తో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 

గత వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు... నేటి మ్యాచ్ లో కివీస్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేయగా... న్యూజిలాండ్ లక్ష్యఛేదనలో ఓపెనర్ డెవాన్ కాన్వే, వన్ డౌన్ బ్యాట్స్ మన్ రచిన్ రవీంద్ర సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ విల్ యంగ్ డకౌట్ అయినా, ఆ ప్రభావమే లేకుండా వీరిద్దరే మ్యాచ్ ను ఫినిష్ చేశారు. 

ఈ జోడీ విజృంభణతో న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించింది. కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు. 

ఈ జోడీని విడదీయడానికి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆరుగురు బౌలర్లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఆరంభంలో శామ్ కరన్ ఒక్క వికెట్ తీయగలిగాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్  ను వికెట్ కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ కు పంపాడు. ఇంగ్లండ్ ఆనందం అంతటితో ఆఖరు. ఆ తర్వాత కాన్వే, రవీంద్ర జోడీ విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్ లో కివీస్ జట్టుకు కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో వికెట్ కీపర్ టామ్ లాథమ్ నాయకత్వం వహించాడు.

  • Loading...

More Telugu News