Team India: గువాహటి చేరుకున్న టీమిండియా... ఇంగ్లండ్ తో తొలి వార్మప్ మ్యాచ్

Team India arrives Guwahati for world cup warm up match with England
  • భారత్ లో అక్టోబరు 5 నుంచి ఐసీసీ వరల్డ్ కప్
  • సన్నాహాలు షురూ చేసిన టీమిండియా
  • ఈ నెల 30న గువాహటిలో ఇంగ్లండ్ తో ప్రాక్టీసు మ్యాచ్
  • అక్టోబరు 8న టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా
సొంతగడ్డపై జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ లో విజేతగా నిలవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇటీవలే ఆసియా కప్ నెగ్గడం, ఆసీస్ తో వన్డే సిరీస్ ను చేజిక్కించుకోవడం, ప్రధాన బ్యాట్స్ మెన్, బౌలర్లు అందరూ ఫామ్ లో ఉండడం వంటి సానుకూల అంశాలతో టీమిండియా శిబిరంలో ఆత్మవిశ్వాసం ఉరకలెత్తుతోంది. 

ఈ నేపథ్యంలో, వరల్డ్ కప్ సన్నాహకాల కోసం టీమిండియా క్రికెటర్లు నేడు గువాహటి చేరుకున్నారు. ఇక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. వరల్డ్ కప్ సన్నద్ధతలో భాగంగా టీమిండియా... గత వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్ తో సెప్టెంబరు 30న తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఈ ప్రాక్టీసు మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. ఆ తర్వాత అక్టోబరు 3న తిరువనంతపురంలో జరిగే రెండో వార్మప్ మ్యాచ్ లో టీమిండియా... నెదర్లాండ్స్ తో తలపడనుంది. 

వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను అక్టోబరు 8న ఆసీస్ తో ఆడనుంది. అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
Team India
Guwahati
ICC World Cup
Warm Up
England

More Telugu News