Dominos: ట్రాఫిక్ లో చిక్కుకున్న కస్టమర్ ను వెతుక్కుంటూ వచ్చి పిజ్జా అందించిన డామినోస్ సిబ్బంది.. వీడియో ఇదిగో!

Dominos tracks customer stuck in Bengaluru traffic and delivers pizza on road
  • బెంగళూరులో బుధవారం భారీగా ట్రాఫిక్ జామ్..
  • గంటల తరబడి రోడ్లపైనే నిలిచిన వాహనాలు
  • లైవ్ లొకేషన్ ఆధారంగా కస్టమర్ కు పిజ్జా డెలివరీ
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
బెంగళూరులో బుధవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోడ్లపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంట్లో ఉండాల్సిన స్కూలు పిల్లలు రాత్రి ఎనిమిదికి కానీ చేరుకోలేదు. ఇంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ డామినోస్ డెలివరీ సిబ్బంది మాత్రం ఆన్ టైంలో పిజ్జా అందించారు. ట్రాఫిక్ లో ఇరుక్కున్న కస్టమర్ ను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఫుడ్ డెలివరీ చేశారు.

లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డెలివరీ బాయ్ తమను వెతుక్కుంటూ వచ్చాడని ఆ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్ లో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. వీడియోలో.. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇంతలో డామినోస్ పిజ్జా డెలివరీ సిబ్బంది స్కూటీపై వచ్చి ఓ కారు ముందు ఆగారు. కారులో కూర్చున్న వారికి పిజ్జా అందించి వెళ్లిపోవడం కనిపిస్తోంది. 

ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళుతూ ఆన్ లైన్ లో డామినోస్ పిజ్జా ఆర్డర్ చేసినట్లు కస్టమర్ రిషివస్త్ చెప్పారు. అనుకోకుండా ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో అదే విషయాన్ని డెలివరీ సిబ్బందికి చెప్పామన్నారు. తమ పరిస్థితి అర్థం చేసుకున్న డెలివరీ సిబ్బంది చాలా దయతో వ్యవహరించారని, లైవ్ ట్రాకింగ్ సాయంతో తమను వెతుక్కుంటూ వచ్చి పిజ్జా అందించారని వివరించారు. ఈ వివరాలతో పాటు పిజ్జా డెలివరీకి సంబంధించిన వీడియోతో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు డామినోస్ డెలివరీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Dominos
Bengaluru traffic
pizza
delivery
Viral Videos

More Telugu News