Ujjain: బాలికపై దారుణ అత్యాచారం.. ఆటో డ్రైవర్ అరెస్ట్

Ujjain rape Auto driver arrested 3 detained girl walked 8 km looking for help
  • మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో వెలుగు చూసిన ఘటన
  • ఆటోలో రక్తపు చారికలు గుర్తించిన పోలీసులు
  • పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణ సమీపంలో బాలికపై దారుణ అత్యాచారం ఘటనలో.. ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆటోలో రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. సదరు ఆటోడ్రైవర్ 38 ఏళ్ల రాకేష్ గా తెలిపారు. 12 ఏళ్ల బాధిత బాలిక అత్యాచారం తర్వాత అర్ధనగ్న స్థితిలో, రక్తస్రావం అవుతుండగా, 8 కిలోమీటర్ల పాటు సాయం కోరుతూ చివరికి ఓ ఆశ్రమాన్ని ఆశ్రయించడం తెలిసిందే. 

పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ఆరంభించారు. 8 కిలోమీటర్ల పొడవునా సీసీటీవీ కెమెరా ఫుటేజీలను తీసుకుని పరిశీలించారు. జీవన్ ఖేరి ప్రాంతంలో బాలిక ఆటో ఎక్కినట్టు గుర్తించారు. ఘటనకు ఒక రోజు ముందు బాలిక తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందినట్టు సాత్నా ఎస్పీ సచిన్ శర్మ మీడియాకు వెల్లడించారు. బాలిక ఇంటి నుంచి వచ్చిన తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురిని కలుసుకున్నట్టు చెప్పారు. బాలిక ఎవరిని అయితే కలుసుకుందో, వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. ఆటోలో రక్తపు చారికలు ఎవరివనేది గుర్తించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 

అత్యాచారం తర్వాత బాలిక వీధుల్లో నడుస్తూ కనిపించిన వారిని సాయం కోరినా, ఎవరూ చేయకపోగా, తరిమి కొట్టడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. చివరికి ఓ ఆశ్రమం నిర్వాహకులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలికకు తీవ్ర గాయాలు కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
Ujjain
girl rape
Auto driver
arrested
bleeding

More Telugu News