Asian Games: మరో బంగారు పతకం గెలిచిన భారత షూటర్లు.. ఈసారి అబ్బాయిల జట్టుకు!
- ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న షూటర్లు
- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టుకు స్వర్ణం
- రజతం గెలిచిన ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ మరో రెండు పతకాలు కైవసం చేసుకుంది. నిన్న రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు గెలిచి షూటింగ్ విభాగం నుంచి మరో స్వర్ణం లభించింది. ఈ ఉదయం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు విభాగంలో భారత్ స్వర్ణ పతకం గెలిచింది. సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ తో కూడిన భారత జట్టు ఫైనల్లో అగ్రస్థానం సాధించింది. సరబ్ జోత్, అర్జున్ సింగ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు అర్హత సాధించారు. మరోవైపు ఉషు మహిళల 60 కిలోల విభాగంలో రోషిబినా దేవి రజత పతకం గెలిచింది. ఫైనల్లో రోషిబినా దేవి చైనాకు చెందిన వు జియావోయ్ చేతిలో పోరాడి ఓడింది. ఆసియా క్రీడల్లో భారత ప్రస్తుతం 24 పతకాలతో నిలిచింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి.