Pakistan Man: హైదరాబాద్‌లో పాకిస్థానీ అల్లుడి అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్!

Big twist in Pak son in law arrested in Hyderabad
  • షార్జాలో హైదరాబాద్ యువతిని పెళ్లాడిని పాక్ యువకుడు
  • అతడి వద్దనున్న డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేసిన మామ
  • నేపాల్ ద్వారా హైదరాబాద్‌కు అక్రమంగా తీసుకొచ్చిన వైనం
  • ఇంట్లోనే రహస్యంగా  దాచి ఆధార్ కార్డు పొందే యత్నం
  • అల్లుడు తెచ్చిన రూ. 5 లక్షలు అయిపోగానే వదిలించుకోవాలని నిర్ణయం
  • టాస్క్‌ఫోర్స్ పోలీసులకు స్వయంగా సమాచారం అందించి అల్లుడిని అరెస్ట్ చేయించిన మామ

హైదరాబాద్‌లో పాకిస్థాన్ అల్లుడి అరెస్టులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. డబ్బులపై పేరాశతో మామే అతడిని పోలీసులకు అప్పగించిన విషయం బయటకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉపాధి కోసం షార్జా వెళ్లిన పాక్ యువకుడు ఫయాజ్ మహ్మద్ (24) అక్కడి దుస్తుల తయారీ కంపెనీలో పరిచయమైన హైదరాబాద్ యువతి నేహా ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా నేహా గతేడాది హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడికొచ్చాక ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది.

షార్జాలో పనిచేస్తున్న అల్లుడి వద్ద బోల్డంత డబ్బు ఉందని భావించిన నేహా తండ్రి జుబేష్ షేక్.. ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. భారత వీసా అయితే ఆలస్యమవుతుందని, అల్లుడికి నేపాల్ వీసా తీసుకున్నాడు. అనంతరం భార్య అఫ్జల్‌బేగం, కుమార్తె నేహా ఫాతిమాతో కలిసి నేపాల్ వెళ్లాడు. అక్కడి నుంచి నలుగురూ కలిసి నేపాల్-యూపీ సరిహద్దులోని సోనాలీ వద్ద గస్తీ సిబ్బందికి రూ. 5 వేలు ఇచ్చి భారత్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడి నుంచి రైలులో హైదరాబాద్ చేరుకున్నారు. 

నగరంలో అడుగుపెట్టాక అల్లుడికి ఆధార్ కార్డు సంపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. అప్పటి వరకు అల్లుడు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండే ఏర్పాట్లు చేశాడు. తన బావమరిది మహ్మద్ గౌస్ పేరుతో అల్లుడికి ఆధార్ కార్డు తీసుకోవాలని భావించి ఓ మీసేవ కేంద్రంలో రూ. 5 వేలు ఇచ్చి జనన ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. ఆ తర్వాత మాదాపూర్‌లోని ఓ ఆధార్ సెంటర్లో దరఖాస్తు చేశాడు. మరోవైపు, అల్లుడు తెచ్చిన దాదాపు రూ. 5 లక్షలు ఖర్చు అయిపోవడంతో అతడిని వదిలించుకోవాలని జుబేష్ ప్లాన్ వేశాడు. టాస్క్ ఫోర్సు పోలీసులకు స్వయంగా సమాచారం అందించి అల్లుడిని పట్టించాడు. పరారైన అత్తమామలను కూడా ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News