ఖలిస్థాన్ ముఠాలపై ఉక్కు పాదం.. దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
- ఖలిస్థాన్, పాక్ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల మధ్య బంధంపై సమాచారం
- ఆరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు
- ముఠాలను ఏరిపారేయడమే లక్ష్యం
ఖలిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల మధ్య అనుబంధానికి సంబంధించిన కీలక సమాచారం ఎన్ఐఏకి అందినట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచి భారత్ వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ, ఉగ్రవాదులకు నిధుల సాయం, ఆయుధాల సరఫరాకు సంబంధించిన సమాచారం ఎన్ఐఏకి అందినట్టు తెలిసింది. దీంతో పంజాబ్ లోని 30 ప్రాంతాల్లో, రాజస్థాన్ లోని 13 ప్రాంతాల్లో, హర్యానాలో నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టినట్టు సమాచారం.
ఈ ముఠాలు కెనడా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం, ఆయుధాల స్మగ్లింగ్, దోపిడీ, హత్యలు, ప్రభుత్వ భవనాలపై దాడులు వంటి చర్యలు చేపడుతున్నట్టు ఎన్ఐఏకి సమాచారం అందింది. దీంతో ఆయా ముఠాలను ఏరిపారేయడానికి ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది.