Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు

Case against Anand Mahindra 12 others for missing airbags in car
  • స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో యువకుడి మృతి
  • ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోకపోవడంతోనే తన బిడ్డ చనిపోయాడని యువకుడి తండ్రి ఆరోపణ
  • కారు భద్రత విషయంలో మహీంద్రా కంపెనీ తనను మోసగించిందని కేసు
  • సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రాతో పాటూ మరో 12 మందిపై ఎఫ్ఐఆర్
కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రాపై కాన్పూర్ లో (ఉత్తరప్రదేశ్) పొలీసు కేసు నమోదైంది. మహీంద్రాతో పాటూ మరో 12 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్కార్పియో కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోని కారణంగా తన కుమారుడు మరణించాడంటూ రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు నమోదైంది. 

రాజేశ్ మిశ్రా 2020లో తన కుమారుడు అపూర్వ్‌కు రూ.17.39 లక్షల స్కార్పియో కారు బహుమతిగా ఇచ్చారు. కాగా, 2022 జనవరి 14న అపూర్వ్, తన స్నేహితులతో కలిసి స్కార్పియోలో లక్నో నుంచి కాన్పూర్ కు తిరిగొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మంచు ఎక్కువగా ఉండటంతో ఎదురుగా ఉన్న రోడ్డు సరిగా కనబడక పోవడంతో అపూర్వ్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అపూర్వ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదసమయంలో అపూర్వ్ కారును డ్రైవ్ చేశారు. 

ప్రమాదం అనంతరం షోరూంకు వెళ్లిన మిశ్రా కారులోని లోపాల కారణంగానే తన కుమారుడు మరణించాడని ఆరోపించారు. తన కుమారుడు సీట్ బెల్టు పెట్టుకున్నా ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోలేదని ఫిర్యాదు చేశారు. కారు భద్రత విషయంలో కంపెనీ తనను మోసం చేసిందని వాపోయారు. సంస్థ తప్పుడు విధానాలను అవలంబించిందని పేర్కొన్నారు. అసలు కారులో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయలేదని కూడా వెల్లడించారు. అమ్మకానికి ముందే కారును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. 

ఈ క్రమంలో షోరూం సిబ్బంది రాజేశ్‌తో వాగ్వాదానికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. కంపెనీ డైరెక్టర్ల ఆదేశాల మేరకు సంస్థ మేనేజర్లు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని కూడా రాజేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆనంద్ మహీంద్రాతో పాటూ మరో 12 మందిపై ఐపీసీ సెక్షన్ 420(చీటింగ్), 287, సెక్షన్ 304-ఏతో పాటూ మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Anand Mahindra

More Telugu News