Asaduddin Owaisi: పార్లమెంటులో ముస్లింలపై మూకదాడులు జరిగే రోజు ఎంతో దూరంలో లేదు: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Muslims will be lynched in Parliament Says Asaduddin Owaisi
  • బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరీ వివాదాస్పద వ్యాఖ్యల ప్రస్తావన
  • ఇంత జరిగినా మోదీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదన్న ఒవైసీ
  • మీ సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ఏమైపోయాయని నిలదీత
పార్లమెంటులో ముస్లింలపై మూకదాడి జరిగే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ముస్లిం ఎంపీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ ఎంపీ పార్లమెంటులోనే ముస్లిం ఎంపీని దుర్భాషలాడడం చూశాం. పార్లమెంటులో ఆయన అలా చేసి ఉండాల్సింది కాదని ప్రజలంతా అంటున్నారు. అతడి నాలుక చాలా చెడ్డదని అంటున్నారు. ప్రజలు ఓటువేసి గెలిపించిన వారికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంటులో ముస్లింలపై మూకదాడి జరిగే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేవారు.

ఇంత జరిగినా ప్రధాని నరేంద్రమోదీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని, మీ ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ ఏమైపోయాయని ప్రశ్నించారు. చంద్రయాన్-3 మిషన్‌పై శుక్రవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా బీఎస్పీ నేత కున్వర్ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి ఆయన వ్యాఖ్యలను తొలగించారు. 

రమేశ్ బిదూరీపై చర్యలు తీసుకోకుంటే తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకుంటానని డానిష్ అలీ స్పష్టం చేశారు. బిదూరీని సస్పెండ్ చేయడం సహా కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు లోక్‌సభ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి.
Asaduddin Owaisi
MIM
Ramesh Bidhuri
Kunwar Danish Ali

More Telugu News