intelligence: నిజ్జర్ హత్యోదంతం: భారత్ ప్రమేయంపై కెనడాకు మరో దేశం నుంచి సమాచారం?

Canada charge after surveilling Indian diplomats Five Eyes ally intelligence
  • కెనడాకు ‘ఫైవ్ ఐస్’ దేశం నుంచి నిఘా వివరాలు
  • తగిన సాక్ష్యాలు ఉన్నాయంటున్న కెనడా ప్రభుత్వ వర్గాలు
  • కెనడాలోని భారత దౌత్యవేత్తలపై నిఘా
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఏకంగా పార్లమెంటులోనే ప్రకటన చేయడంతో.. రెండు దేశాల దౌత్య సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి. కెనడా వాసులకు వీసాలను సైతం భారత్ సర్కారు నిలిపివేసే దాకా ఇది వెళ్లింది. కెనడా ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇవన్నీ అసంబద్ధమైన, రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది. కెనడా తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ తమతో పంచుకోలేదని స్పష్టం చేసింది. 

అయితే, తమ ఆరోపణలకు తగిన సాక్ష్యాలు ఉన్నాయన్నది కెనడా అధికారుల వాదన. ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వ వర్గాలు సీబీసీ న్యూస్ కు వెల్లడించాయి. నిజ్జర్ హత్యలో భారత పాత్రకు సంబంధించి కెనడాలోని భారత దౌత్య వేత్తల సంభాషణల ఆధారాలు, నిఘా వివరాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి కెనడా ఇంటెలిజెన్స్ నుంచే ఈ సమాచారం రాలేదు. కెనడాతో కూడిన ‘ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలియన్స్’ (కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) లో ఒక దేశం నుంచి సమాచారం వచ్చినట్టు కెనడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా భారత దౌత్య అధికారులపై నిఘా వేసి సమాచారం రాబట్టినట్టు చెబుతున్నాయి.

నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో సహకారం కోరుతూ కెనడా అధికారులు పలు సందర్భాల్లో భారత్ కు వచ్చినట్టు తెలిసింది. నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందనడానికి సాక్ష్యాలు ఉన్నాయంటూ ప్రైవేటు మార్గాల్లో పంచుకున్నప్పటికీ దీన్ని భారత అధికారులు ఖండించలేదని కెనడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికైతే కెనడా తన ఆరోపణలకు సాక్ష్యాలను విడుదల చేయలేదు. చట్టబద్ధమైన ప్రక్రియలో భాగంగా తర్వాత బయటకు వస్తాయని చెబుతున్నాయి.
intelligence
Canada
surveilling
Indian diplomats

More Telugu News