Telangana: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతికి పురుగుల మందు తాగించి హత్య

Man Molested Young Woman In The Name Of Love And Forced Her To Drink Insecticide
  • తనను ప్రేమించలేదనే కోపంతో ఓ యువకుడి దారుణం
  • ఇద్దరు పిల్లల తండ్రి అయినా ప్రేమిస్తున్నానని వెంటపడ్డ వైనం
  • తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో హత్య.. కుమురంభీం జిల్లాలో ఘటన
తెలంగాణలోని కుమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదనే కక్షతో ఓ యువతిని హత్య చేశాడో వ్యక్తి.. బలవంతంగా పురుగుల మందు తాగించి పారిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. ఆరు నెలలుగా యువతి వెంటపడుతున్న సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లి అయింది. అంతేకాదు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు.

కుమురంభీం జిల్లా వెంకట్రావ్‌పేటకు చెందిన బుడే దీప (19) ఇంటర్ తో చదువు ఆపేసింది. గ్రామంలో కూలి పనులకు వెళుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్‌ ప్రేమించానంటూ దీప వెంటపడుతున్నాడు. ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. కమలాకర్ కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా దీపను వేధిస్తున్నాడు. తననే ప్రేమించాలని లేదంటే దీప ఇంట్లో వాళ్లను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అయినా దీప ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 17న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దీప ఒంటరిగా ఉండడం గమనించి ఇంట్లోకి చొరబడ్డాడు. తనను కాదని వేరే వాళ్లతో మాట్లాడవద్దంటూ దీపపై చేయిచేసుకున్నాడు.

ఇంట్లో ఉన్న పురుగులమందును దీప నోట్లో పోసి బలవంతంగా మింగించాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే దీపను సిర్పూర్ (టి) ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కాగజ్ నగర్ కు, ఆపై మంచిర్యాలకు తరలించారు. దీప ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో కరీంనగర్ తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసింది. తొలుత దీప ఆత్మహత్యకు పాల్పడిందని భావించగా.. కమలాకర్ బలవంతంగా పురుగుల మందు తాగిస్తుండగా చూసిన పదేళ్ల పాప ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఆ విషయాన్ని పోలీసులకు వెల్లడించారు. దీంతో పోలీసులు ఆ చిన్నారిని విచారించి మరిన్ని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి, నిందితుడు కమలాకర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Telangana
kumrambheem
asifabad
love
murder
insecticide drink

More Telugu News