Sunil Gavaskar: భారత్, పాక్ జట్లలో ఎవరిది బెస్ట్ బౌలింగ్ విభాగమో చెప్పిన గవాస్కర్

Gavaskar said India pace attack is better than Pakistan
  • త్వరలో వరల్డ్ కప్... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవాస్కర్
  • భారత పేస్ విభాగంపై ప్రశంసలు 
  • బుమ్రా భారత పేస్ ను పదునెక్కించాడని వ్యాఖ్యలు
  • సిరాజ్ అరుదైన బౌలర్ అని కితాబు
  • పాక్ కంటే మనదే మెరుగైన పేస్ అటాక్ అని స్పష్టీకరణ
వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ జట్లలో ఎవరిది బెస్ట్ పేస్ బౌలింగ్ విభాగం అనే అంశంపై స్పందించారు. సాధారణంగా నాణ్యమైన పేసర్లకు పాకిస్థాన్ పుట్టినిల్లు అని చెబుతుంటారు. ఆ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ పేసర్లను పాకిస్థాన్ ఉత్పత్తి చేసింది. ఇప్పుడున్న జట్టులోనూ షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్ లను ప్రతిభను తక్కువగా అంచనా వేయలేం. 

అయితే, పాకిస్థాన్ తో పోల్చితే ఇప్పటి భారత పేస్ బౌలింగ్ అటాక్ ఎంతో మెరుగ్గా ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. గతంలో భారత జట్టుకు ఇంత నైపుణ్యమైన్న పేస్ బౌలింగ్ విభాగం ఉన్నట్టు తానెప్పుడూ చూడలేదని అన్నారు. 

బుమ్రా, సిరాజ్ వంటి ప్రతిభావంతుల రాకతో భారత పేస్ ముఖచిత్రం మారిపోయిందని వివరించారు. బుమ్రా వచ్చాక కొత్తబంతితో భారత్ ప్రమాదకరంగా మారిందని, ప్రతి బంతికీ వికెట్ తీయాలనే కసి ఉన్న సిరాజ్ వంటి బౌలర్లు చాలా తక్కువగా కనిపిస్తుంటారని సన్నీ పేర్కొన్నారు. 

"ఒక్కోసారి బుమ్రా ఆరంభంలో వికెట్లు తీయలేకపోవచ్చు. కానీ అతడు బౌలింగ్ చేస్తున్నంత సేపు బ్యాట్స్ మెన్ ఒత్తిడిలోనే ఉంటారు. ఇక, మహ్మద్ షమీని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. అతడు తుది జట్టులో లేకపోయినా అతడి స్థాయి ఏమాత్రం తగ్గదు. షమీ అంతటివాడే రిజర్వ్ బెంచ్ పై ఉన్నాడంటే భారత పేస్ విభాగం ఎంత పదునెక్కిందో అర్థం చేసుకోవచ్చు. 

ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ బౌలింగ్ అమోఘం. అతడి పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలుసు. ఇలాంటి పేసర్లతో భారత్... పాకిస్థాన్ ను అధిగమించింది. మొన్నటి వరకు పేస్ అంటే పాక్ జట్టు గురించి చెప్పేవారు... ఇప్పుడు భారత జట్టు గురించి మాట్లాడుతున్నారు" అని గవాస్కర్ వివరించారు.
Sunil Gavaskar
Pace Bowling
Team India
Pakistan

More Telugu News