Taneti Vanita: జైల్లో మావోయిస్ట్‌లు ఉన్నా చంద్రబాబుకు ఇబ్బందిలేదు: ఏపీ హోంమంత్రి తానేటి వనిత

Home Minister Taneti Vanitha on Chandrababu security in jail
  • చంద్రబాబు భద్రత ప్రభుత్వ బాధ్యత అన్న తానేటి వనిత
  • ఇప్పటికైనా చంద్రబాబు విచారణకు సహకరించాలని సూచన
  • నేరం రుజువైతే లోకేశ్ అరెస్ట్ కూడా తప్పదని వ్యాఖ్య
  • లోకేశ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణలకు తానేటి వనిత హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత అన్నారు. జైల్లో మావోయిస్టులు ఉన్నా బాబుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మావోయిస్టు బ్లాక్ చంద్రబాబు బ్లాక్‌కు దూరంగా ఉంటుందన్నారు. ఆయన భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సాక్ష్యాలు లేకుండా ఎవరూ అరెస్ట్ చేయలేరన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో పూర్తి ఆధారాలతోనే సీఐడీ అతనిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

చంద్రబాబు కోసం చట్టాలు, జైలును రూపొందించలేదని గుర్తించాలన్నారు. జైల్లో అనేక రకాల నేరస్తులు ఉంటారన్నారు. రాజమండ్రి కేంద్రకారాగారంలో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రతను కల్పించామన్నారు. ఆయనకు ఇంటి భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు విచారణకు సహకరించాలన్నారు. ఈ అరెస్ట్‌లో ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదన్నారు. కానీ నాడు జగన్‌పై కక్షతో కాంగ్రెస్‌తో కలిసి జైలుకు పంపించారన్నారు.

చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై తానేటి వనిత స్పందిస్తూ... ఆమెకు మన రాష్ట్రంపై ఏ మేరకు అవగాహన ఉందో తనకు తెలియదన్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పదేపదే తనను అరెస్ట్ చేయాలని చెప్పనక్కరలేదని వ్యాఖ్యానించారు. నేరం రుజువైతే అతని అరెస్ట్ కూడా తప్పదన్నారు. లోకేశ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణలు వారి పని వారు చేసుకోవాలని, రోడ్డెక్కి ప్రజలను రెచ్చగొడితే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News