Madras High Court: పిల్లలకు ఇచ్చే ఆస్తిపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

  • కన్నవాళ్ల బాగోగులు విస్మరిస్తే ఆస్తి వెనక్కి తీసుకోవచ్చన్న మద్రాస్ హైకోర్టు
  • ఆస్తికి ప్రతిఫలం ప్రేమ, ఆప్యాయతలేనని స్పష్టీకరణ
  • సెటిల్‌మెంట్ డీడ్ రద్దు చేయడంతో హైకోర్టును ఆశ్రయించిన కొడుకు
  • ఆయన వాదనలను కొట్టేసిన ధర్మాసనం
Not just food  kids must give parents dignified life Said Madras High Court

ఆస్తులు రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోని సంతానానికి మద్రాస్ హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆస్తులు సొంతం చేసుకున్న తర్వాత కన్నవాళ్ల బాగోగులు చూడడాన్ని విస్మరిస్తే ఆ ఆస్తులను వారు వెనక్కి తీసుకోవచ్చంటూ జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. పిల్లల ప్రయోజనం కోసం ప్రేమ, ఆప్యాయతలతో ఆస్తిని ఇస్తున్నట్టు సెటిల్‌మెంట్ దస్తావేజులో పేర్కొంటే చాలని.. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంలోని నిబంధనను అది సంతృప్తి పరుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. దీనికి ప్రతిఫలం ప్రేమ ఆప్యాయతలేనని, దీనిని వెనక్కి ఇవ్వడంలో ఉల్లంఘనలు జరిగితే చట్ట ప్రకారం చర్యలు చేపట్టవచ్చునని పేర్కొంది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. షకీరా బేగం తన కుమారుడు మహమ్మద్‌ దయాన్‌ పేరు మీద కొంత ఆస్తిని రాశారు. ఆస్తిని తీసుకున్న కుమారుడు ఆ తర్వాత ఆమె బాగోగులను పట్టించుకోవడం మానేశాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లి తిరుప్పూరు సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి తమ సెటిల్‌మెంట్ డీడ్‌ను రద్దు చేయాలని కోరారు. ఆమె అభ్యర్థనను మన్నించి ఆయన దానిని రద్దు చేశారు. 

సెటిల్‌మెంట్ డీడ్‌ను రద్దు చేయాన్ని దయాన్ హైకోర్టులో సవాలు చేశారు. అందులో ఎలాంటి షరతులు ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను కోర్టు కొట్టివేసింది. తల్లిదండ్రులకు ఇంత వండిపెట్టి, షెల్టర్ ఇస్తే సరిపోదని తేల్చి చెప్పింది. ఆస్తి తీసుకున్నందుకు ప్రతిఫలంగా ప్రేమ, ఆప్యాయతలు వెనక్కి ఇవ్వడంలో ఉల్లంఘన జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చంటూ సంచలన తీర్పు వెల్లడించింది.

More Telugu News