IPhone curbs: భారత్ బాటలోనే చైనా.. ఐఫోన్లు నిషేధించే దిశగా ప్రయత్నాలు..!

China moves to widen state employee iPhone curbs
  • విదేశీ సాంకేతికతపై ఆధారపడటం తగ్గించుకోవాలనుకుంటున్న చైనా
  • ప్రభుత్వోద్యోగుల ఐఫోన్ వినియోగంపై ఆంక్షలు మరింతగా విస్తరణ
  • అమెరికా, చైనా మధ్య ఎడం మరింతగా పెరుగుతోందనడానికి సూచన  
విదేశీ సాంకేతికతపై ఆధారపడటం తగ్గించుకోవాలనుకుంటున్న చైనా ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌ లాగా విదేశీ ఉత్పత్తులపై నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. 

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని అధికారులు ఐఫోన్ల వాడకంపై చైనా ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని తాజాగా మరిన్ని శాఖలకు విస్తరించింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది తమ కార్యాలయాల్లో ఈ ఫోన్లు వాడొద్దని, వాటిని ఆఫీసులకు తీసుకురావద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఐఫోన్ల వాడకంతో సమస్యలు తలెత్తిన పక్షంలో ప్రభుత్వోద్యోగులే బాధ్యత వహించాల్సి వస్తుందని మౌఖికంగా ఆదేశించినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వోద్యోగులతో పాటు ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని కంపెనీలకూ ఈ నిబంధన విస్తరింపజేయాలని చూస్తున్నట్టు పేర్కొంది. 

అమెరికా, చైనా మధ్య ఎడం మరింతగా పెరుగుతోందనడానికి తాజా పరిణామం ఓ నిదర్శనమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చైనాలో అధిక మార్కెట్టును కలిగివున్న అమెరికాకు ఇది సమస్యగా మారుతుందని అంచనా వేస్తున్నారు. కానీ, ఈ వార్తపై చైనా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రెండేళ్ల క్రితమే కొన్ని శాఖల్లోని సీనియర్ అధికారులు ఐఫోన్లకు బదులు స్థానికంగా తయారైన ఫోన్లను వినియోగించడం ప్రారంభించారని చైనా వర్గాలు పేర్కొన్నాయి.
IPhone curbs
China
USA

More Telugu News