Andhra Pradesh: ఇకపై పాత విధానంలోనూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి: ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ

Stamps and Registrations dept explains old system also will be available for registration in AP
  • రిజిస్ట్రేషన్ల కోసం కొత్త సాఫ్ట్ వేర్
  • కార్డ్ ప్రైమ్ 2.0 తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
  • డాక్యుమెంట్ రైటర్ల నుంచి తీవ్ర నిరసన
  • రెండ్రోజులు పెన్ డౌన్ చేసిన దస్తావేజు లేఖరులు
  • పాత, కొత్త విధానాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న ప్రభుత్వం

ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం కార్డ్ ప్రైమ్ 2.0 సాఫ్ట్ వేర్ ను సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. దీని సాయంతో వినియోగదారులే టైమ్ స్లాట్ బుక్ చేసుకుని ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 

పత్రాలతో పని లేకుండా ఈ-డాక్యుమెంట్ల సాయంతో కేవలం 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఆధార్ తో లింక్ చేయడం వల్ల మరొకరు దుర్వినియోగం చేసే అవకాశం ఉండదని అంటోంది. 

అయితే, ఈ ఆన్ లైన్ విధానం తమ పొట్ట కొట్టేలా ఉందని డాక్యుమెంట్ రైటర్లు (దస్తావేజు లేఖరులు) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు ఆగస్టు 30, 31 తేదీల్లో పెన్ డౌన్ చేసి నిరసన తెలిపారు. దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నామని, తమ ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

దీనిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పందించింది. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆప్షనల్ మాత్రమేనని, ప్రజలు తమకిష్టమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. పాత, కొత్త విధానాల్లో స్థిరాస్తి క్రయవిక్రయాలు చేసుకోవచ్చని వివరించారు. పాత విధానం కూడా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన సదస్సులో వివరణ ఇచ్చారు. 

తాము ఎక్కడా పాత విధానాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పలేదని, కొందరు అవగాహన లోపంతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఐజీ రామ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News