Warangal Urban District: డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయి పోలీసుల ముందే బైక్‌కు నిప్పు

  • వరంగల్ లో డ్రంకెన్ డ్రైవ్‌ లో పోలీసులకు చిక్కిన బైకర్
  • బైక్‌ను దూరంలోనే ఆపి కాలినడకన రోడ్డు దాటే ప్రయత్నం
  • అతడిని గమనించి కేసు పెట్టేందుకు సిద్ధమైన పోలీసులు 
  • వాహనం నడుపుతూ చిక్కనప్పుడు కేసు ఎలా పెడతారని వాహనదారుడి వాగ్వాదం
  • పోలీసుల ముందే వాహనం పెట్రోల్‌ పైప్ తొలగించి నిప్పు
  • పక్క షాపులోంచి నీరు తెచ్చి మంటలను ఆర్పిన పోలీసులు
Drunk Biker sets his bike on fire after getting caught by police in warangal city

 డ్రంకెన్ డ్రైవ్‌ లో దొరికిపోయిన ఓ వ్యక్తి నానా యాగీ చేశాడు. పోలీసులపై మండిపడుతూ వారు చూస్తుండగానే తన బైక్‌కు నిప్పు పెట్టేశాడు. వరంగల్ నగరంలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, నగరంలో శనివారం రాత్రి ట్రాఫిక్ ఎస్సై రవి వాహనాల తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో అటువైపు బైక్‌పై వస్తున్న పులిశేరు శివ తన వాహనాన్ని ప్రధాన తపాలా కేంద్రం కూడలి రహదారి పక్కన నిలిపి రోడ్డుదాటుతుండగా పోలీసులు పట్టుకున్నారు. 

మద్యం మత్తులో శివ వాహనం నడుపుతుండటాన్ని తాము చూశామని, కేసు పెడతామని చెప్పడంతో అతడు రెచ్చిపోయాడు. అందరూ చూస్తుండగానే తన వాహనం పెట్రోల్ పైపును తొలగించి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వేగంగా స్పందించిన పోలీసులు పక్కనే ఉన్న షాపులోంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పారు. అనంతరం, వాహనాన్ని వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలానికి తరలించారు. తాను మద్యం మత్తులో వాహనం నడుపుతూ దొరకనప్పుడు కేసు ఎలా నమోదు చేస్తారని శివ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More Telugu News