Rinku Singh: సూపర్ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాది జట్టును గెలిపించిన రింకుసింగ్.. వీడియో ఇదిగో

Rinku Singh smashes 3 sixes in Super Over in UP T20 League
  • యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్‌కు రింకు ప్రాతినిధ్యం
  • కాశీ రుద్రాస్‌తో జరిగిన మ్యాచ్ టై
  • తొలుత నిరాశపరిచినా సూపర్ ఓవర్‌లో రింకు విధ్వంసం 

టీమిండియా యువ సంచలనం రింకుసింగ్ మరోమారు చెలరేగిపోయాడు. సూపర్ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు. కాన్పూరులో జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్‌లో జరిగిందీ ఘటన. మీరట్‌ మావెరిక్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూసింగ్ కాశీ రుద్రాస్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోమారు విశ్వరూపం ప్రదర్శించాడు. సూపర్ ఓవర్‌లో మీరట్ జట్టు విజయానికి 17 పరుగులు అవసరం కాగా, హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన రింకు మరోమారు తానేంటో నిరూపించాడు. అంతకుముందు కాశీ రుద్రాస్ సూపర్ ఓవర్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. 

శివసింగ్ సంధించిన తొలి బంతి డాట్‌బాల్ కావడంతో మీరట్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. అయితే, రింకూ ఆ తర్వాతి బంతి నుంచి చెలరేగిపోయాడు. రెండో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్స్ బాదిన రింకు.. మూడో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. ఆ తర్వాత లాంగాఫ్ మీదుగా మరో సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అంతకుముందు ఇరు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అంతకుముందు రింకుసింగ్ 22 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయినప్పటికీ సూపర్ ఓవర్‌లో మీరట్ ఫ్రాంచైజీ అతడినే క్రీజులోకి పంపింది. ఈసారి మాత్రం అతడు నిరాశపరచలేదు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ జట్టుకు విజయన్ని అందించిపెట్టాడు.

  • Loading...

More Telugu News