అదానీ కంపెనీల్లో షార్ట్ సెల్లింగ్ తో 12 సంస్థలకు లాభాలు: సెబీ రిపోర్ట్
- హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడించడానికి ముందే అమ్మకాలు
- కొన్ని సంస్థలు మొదటిసారిగా షార్ట్ సెల్లింగ్ కు పాల్పడినట్టు గుర్తింపు
- ఈడీ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు
హిండెన్ బర్గ్ నివేదిక జనవరి 24న విడుదల కాగా, దీనికంటే రెండు మూడు రోజుల ముందుగా ఆయా సంస్థలు షార్ట్ సెల్లింగ్ తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. కొందరు/కొన్ని సంస్థలు అయితే షార్ట్ సెల్లింగ్ కు దిగడం మొదటిసారి అని తెలిసింది. మూడు కంపెనీలు భారత్ కేంద్రంగా పనిచేసేవి. ఒకటి విదేశీ బ్యాంక్ కు చెందిన భారత బ్రాంచ్. నాలుగు సంస్థలు మారిషస్ కేంద్రంగా పనిచేస్తున్నవి. అలాగే, ఫ్రాన్స్, హాంగ్ కాంగ్, కేమన్ ఐలాండ్స్, లండన్ నుంచి ఒక్కో సంస్థ షార్ట్ సెల్లింగ్ లో పాల్గొన్నాయి. ఉదాహరణకు ఒక సంస్థ 2020 జూలైలోనే ఏర్పాటైంది. 2021 సెప్టెంబర్ వరకు కార్యకలాపాలు ఏమీ లేవు. కానీ, 2021 సెప్టెంబర్ నుంచి 2022 మార్చి వరకు రూ.31,000 కోట్ల టర్నోవర్ పై రూ.1,100 కోట్ల లాభం వచ్చినట్టు ప్రకటించింది. మొత్తం సెబీ 22 అంశాలపై తన దర్యాప్తును పూర్తి చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించగా, మరో రెండు అంశాలపై విదేశీ ఏజెన్సీల నుంచి సమాచారం కోసం చూస్తున్నట్టు తెలిపింది. విదేశీ సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల్లో షార్ట్ సెల్లింగ్ కు పాల్పడడానికి వీలుగా ఎఫ్ పీఐలు, ఎఫ్ఐఐలు బ్రోకర్లుగా పనిచేసి ఉంటారని, అసలు లాభాలకు వాళ్లు లబ్ధిదారులు కాకపోవచ్చని ఈడీ తన దర్యాప్తులో తేల్చింది.