Pawan Kalyan: అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం: పవన్ కల్యాణ్

Pawan Kalyan congratulates Allu Arjun after center announced him as national best actor
  • జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు
  • అల్లు అర్జున్ హృదయపూర్వక అభినందనలు అంటూ పవన్ ప్రకటన
  • ఇతర విజేతలను పేరుపేరునా అభినందించిన జనసేనాని

కేంద్ర ప్రభుత్వం ఇవాళ జాతీయ అవార్డులు ప్రకటించడం పట్ల జనసేనాని, టాలీవుడ్ అగ్రహీరో పవన్ కల్యాణ్ స్పందించారు. పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికవడం అందరూ ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ అందుకోనుండడం పట్ల హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ వివరించారు. 

69వ జాతీయ సినీ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక విభాగాల్లో అవార్డులు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ, సినిమా రూపకల్పనలో నిమగ్నమయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉన్నాయని తెలిపారు. 

మోస్ట్ పాప్యులర్ మూవీగా ఆర్ఆర్ఆర్ చిత్రం జాతీయ అవార్డుకు ఎంపికైందని, అందుకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని, నిర్మాత డీవీవీ దానయ్యలను అభినందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాకు గాను జాతీయ పురస్కారాలకు ఎంపికైన ఎంఎం కీరవాణి, కాలభైరవ, శ్రీనివాస మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలోమన్... లిరిక్ రైటర్ చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఉత్తమ సినీ విమర్శకుడు పురుషోత్తమాచార్యులకు అభినందనలు తెలుపుకుంటున్నానని పవన్ వివరించారు. 

ఉప్పెన చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపిక కావడం సంతోషకరం అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు, దర్శకుడు సానా బుచ్చిబాబుకు అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

"శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని చూపిన రాకెట్రీ చిత్రాన్ని ఉత్తమంగా నిలిపిన దర్శకుడు, నటుడు ఆర్.మాధవన్ కు అభినందనలు. గంగూభాయ్ కథియావాడి చిత్రానికి అలియా భట్, మిమి చిత్రానికి గాను కృతి సనన్ ఉత్తమ నటీమణులుగా నిలిచారు... వారు ప్రశంసలకు అర్హులు. 

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ముఖ్యమైన అవార్డులు దక్కించుకుంది. ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి అభినందనలు. జాతీయ ఉత్తమ దర్శకుడిగా నిలిచిన మరాఠీ దర్శకుడు నిఖిల్ మహాజన్ (గోదావరి) కు, ఇతర విజేతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను" అంటూ పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News