ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డును అందుకున్న 'కడైసీ వివసాయి' కథ ఇదే!
- 2022లో విడుదలైన 'కడైసీ వివసాయి'
- 86 ఏళ్ల వృద్ధుడే కథానాయకుడు
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- వ్యవసాయంతో ముడిపడిన జీవితాల ఆవిష్కరణ
- ఎమోషన్స్ తో కట్టిపడేసే సహజమైన సన్నివేశాలు
ఈ సినిమాలో కథానాయకుడు 86 ఏళ్ల వృద్ధుడు. తాను పుట్టిపెరిగిన ఊరు .. తన పూర్వీకుల నుంచి వచ్చిన కొద్ది పాటి పొలం .. చిన్నపాటి గుడిసె .. ఇదీ అతని ఆస్తి. ఏ పంటకి ఏ సమయంలో ఏం కావాలో తెలిసిన అనుభవం ఆయన సొంతం. ఊళ్లో వాళ్లంతా ఆయన అనుభవాన్ని గౌరవిస్తూ ఉంటారు. ఆకలితోనైనా ఉంటాడుగానీ .. అప్పు మాత్రం చేయడు. అలాంటి ఆయన పొలాన్ని కాజేయడానికి కొంతమంది పెద్దలు ప్లాన్ చేస్తారు.
ఆ రైతు తన పొలంలో చనిపోయి ఉన్న మూడు నెమళ్లను పూడ్చేస్తాడు. ఆ పెద్ద తలకాయలు ఆయనే ఆ నెమళ్లను చంపాడని కేసు పెడతారు. పోలీస్ వ్యవస్థ .. కోర్టు .. వాదనలు ఇవేమీ ఆయనకి పట్టవు. తన పొలానికి నీళ్లు పెట్టాలి .. తన పశువులకు మేత వేయాలి .. అదే ఆయన ఆలోచన. ఆయనలోని ఆ తపనే జడ్జిని కూడా కదిలిస్తుంది. ఆమెనే నేరుగా అతన్ని ఆ పొలం దగ్గరికి తీసుకుని వచ్చి దింపేసి వెళుతుంది.
గ్రామీణ జీవితం .. వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవితం .. అక్కడి నమ్మకాలు .. ఆచారాలు .. ప్రకృతితో .. పశువులతో .. పక్షులతో ముడిపడిపోయిన జీవితలను ఈ కథలో ఆవిష్కరించారు. రైతు తన పొలానికి .. తాను అలవాటు పడిన ప్రకృతికి దూరంగా బ్రతకలేడని చాటిచెప్పే ఈ కథ మనసును కదిలించి వేస్తుంది .. కన్నీళ్లు పెట్టిస్తుంది.
