బెంగళూరు టెక్కీ రూ.2.7 లక్షల లోన్ తీసుకున్నాడు... తన కోసం కాదు!

Bengaluru techie takes loan to fill patholes
  • బెంగళూరులో రోడ్లపై గుంతలు
  • గాయాల పాలవుతున్న వాహనదారులు
  • తన గ్రూప్ తో కలిసి నిధులు సేకరించిన ఓ టెక్కీ
  • ఆ డబ్బుతో గుంతలు పూడ్చిన వైనం
  • డబ్బు అయిపోవడంతో సొంతంగా లోన్ తీసుకున్న టెక్కీ
మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో రోడ్లు ఇప్పటికీ అధ్వాన స్థితిలో ఉండడం మీడియాలో చూస్తుంటాం. బెంగళూరు నగరం కూడా అందుకు మినహాయింపు కాదు. రోడ్లపై గుంతలను చూసి విసుగెత్తిపోయిన ఓ టెక్కీ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. రూ.2.7 లక్షల లోన్ తీసుకుని, ఆ డబ్బుతో తానే రోడ్లపై గుంతలను పూడ్చడం మొదలుపెట్టాడు. 

అతడి పేరు ఆరిఫ్ ముద్గల్. ఆరిఫ్ కొన్ని రోజుల కిందట గుంతలమయమైన హోసా రోడ్డుపై రెండు యాక్సిడెంట్లు జరగడం చూశాడు. తన అపార్ట్ మెంట్ కు దగ్గర్లో నివసించే ఓ మహిళ గుంతల రోడ్డుపై ప్రయాణిస్తూ గాయాలపాలవడం అతడిని ఆలోచింపజేసింది. హోసా రోడ్డులోని అదే గుంతను తప్పించబోయి ఓ డెలివరీ ఏజెంటు గాయపడడం కూడా ఆరిఫ్ కంటబడింది. 

32 ఏళ్ల ఆరిఫ్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. తనలాగే సమాజం కోసం ఆలోచించేవాళ్లతో కలిసి సిటిజెన్స్ గ్రూప్-ఈస్ట్ బెంగళూరు అనే సంస్థను ఐదేళ్ల కిందట స్థాపించాడు. ఇప్పుడు తన సంస్థతో కలిసి నిధులు సమీకరించిన ఆరిఫ్ బెంగళూరులోని హలనాయకనహళ్లి, మునేశ్వర లే అవుట్, చూడసంద్ర రోడ్లపై కొన్ని గుంతలను పూడ్చాడు. ఆ డబ్బు అయిపోవడంతో, సొంతంగా రూ.2.7 లక్షల లోన్ తీసుకువచ్చాడు. 

కాగా, ఈ గ్రూప్ లో ఓ సభ్యుడైన మిథిలేశ్ కుమార్ మీడియాతో మాట్లాడాడు. రోడ్లపై గుంతల విషయంలో తాము కొందరు ప్రజాప్రతినిధులను కలిశామని, వారి స్పందన ఆశించిన స్థాయిలో లేదని తెలిపాడు. ఈ ప్రాంతంలో నివసించేవారంతా పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వారన్న భావన వారి మాటల్లో వ్యక్తమైందని పేర్కొన్నాడు. దాంతో, తాము ఆస్తి పన్ను చెల్లించవద్దంటూ ప్రచారం చేపట్టామని వెల్లడించాడు. 

దీనిపై ఎక్స్ (గతంలో ట్విట్టర్)లోనూ ఈ గ్రూప్ ప్రచారం చేపట్టింది. నో డెవలప్ మెంట్ నో ట్యాక్స్ అంటూ నెటిజన్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
Go Back to Shorts
Bengaluru
Arif Mudgal
Techie
Patholes
Roads
Loan
Citizens Group East Bengaluru

More Telugu News