Raja Singh: గోషామహల్ అభ్యర్థిని కేసీఆర్ ఎందుకు ప్రకటించలేదో చెప్పిన రాజాసింగ్!

  • గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించిన రాజాసింగ్
  • మజ్లిస్ పార్టీ ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని విమర్శ
  • బీజేపీ నుండి మరోసారి తాను పోటీలో ఉంటున్నానని వెల్లడి
Raja Singh reveals why KCR not announced Ghoshamahal candidate

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ప్రకటించిన జాబితాలో గోషామహల్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ నిర్ణయిస్తుందని, అందుకే ప్రకటించలేదని ఆరోపించారు. ఇక్కడి అభ్యర్థిని సీఎం కేసీఆర్ నిర్ణయించరన్నారు. 2018లోను మజ్లిస్ పార్టీయే అభ్యర్థిని నిర్ణయించిందన్నారు.

తనను ఓడించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశారన్నారు. కానీ ఈసారి కూడా బీజేపీ నుంచి తానే పోటీలో ఉంటున్నానని, హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి పెద్దల ఆశీర్వాదం తనకు ఉందన్నారు. నా గోషామహల్ కార్యకర్తల్లారా! సిద్ధం కండి.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకు వద్దామన్నారు.

కేసీఆర్‌లో అభద్రతా భావం కనిపిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అనేక సర్వేలు కేసీఆర్‌కు అనుకూలంగా లేవన్నారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి కాళ్ల కింద భూమి కదిలిపోతోందన్నారు.

గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ రెండోస్థానం నుంచి పోటీ చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సగం మంది ఓడిపోవడం ఖాయమన్నారు.

కేసీఆర్ అభధ్రతా భావంతోనే రెండుచోట్ల నుండి పోటీ చేస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మోసాలను ప్రజలకు తాము వివరిస్తామన్నారు.

More Telugu News