Chandrababu: రామోజీరావుపై వైసీపీ చేసిన దాడులను ఖండిస్తున్నా: చంద్రబాబు

  • మీడియాను కూల్చేందుకు జగన్ యత్నిస్తున్నారన్న చంద్రబాబు
  • సొంత వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకతతో జగన్ నిరాశలో కూరుకుపోయాడని వ్యాఖ్య
  • మార్గదర్శి ఖ్యాతి దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపాటు
Iam condemning Jagan attacks on Ramojirao says Chandrababu

మీడియా వ్యవస్థను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సంస్థలను నిర్వీర్యం చేసే ధోరణిని కొనసాగిస్తూ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభమైన మీడియాను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నియంతలా వ్యవహరిస్తూ తనను స్తుతించే మీడియాకు ప్రాధాన్యతనిస్తూ, వైసీపీ మోసాలను, నీచమైన పనులను బయటపెట్టే ఈనాడులాంటి మీడియాను వేధించి, బెదిరిస్తున్నాడని దుయ్యబట్టారు. తన సొంత వైఫల్యాలు, ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతతో జగన్ నిరాశలో కూరుకుపోయాడని చెప్పారు. 60 ఏళ్లుగా తెలుగు ప్రజలకు సేవ చేసిన మార్గదర్శి వంటి దీర్ఘకాల సంస్థలను జగన్ లక్ష్యంగా చేసుకున్నాడని, ఆ సంస్థ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. 

జర్నలిజం, సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన సేవలకు గాను రామోజీరావును దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో భారత ప్రభుత్వం సత్కరించిందని... ఎంతో ఉన్నత విలువలు కలిగిన రామోజీరావుపై వైసీపీ చేసిన దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. జగన్ ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని... ఎందుకంటే చెడు ఎప్పుడూ ఓడిపోతుందని, మంచి ఎప్పుడూ గెలుపొందుతుంటుందని చెప్పారు. 

More Telugu News