Gautam Singhania: కారు ఖరీదు రూ.3.69 కోట్లు... కానీ ఈ భారత కుబేరుడికి చెత్త కారులా అనిపించింది!

Indian business tycoon Gautam Singhania terms Maserati MC20 a worst car ever
  • లగ్జరీ కార్ల తయారీకి ప్రసిద్ధికెక్కిన ఇటలీ కంపెనీ మాసెరాటి
  • ఎంసీ-20 మోడల్ ను తీసుకువచ్చిన సంస్థ
  • తన జీవితంలో ఇంత దరిద్రగొట్టు కారు నడపలేదన్న గౌతమ్ సింఘానియా
  • ఇది ప్రమాదకరమైన కారు అని విమర్శలు
  • నడిపేవాడు దీంట్లోనే చస్తాడని వ్యాఖ్యలు
ఇటలీకి చెందిన మాసెరాటి కంపెనీ లగ్జరీ కార్ల తయారీకి పెట్టింది పేరు. లాంబోర్ఘిని, పోర్షే,ఫెరారీ వంటి హైఎండ్ కార్ల కంపెనీల వరుసలోనే మాసెరాటి కూడా నిలుస్తోంది. మాసెరాటి ఎంసీ-20 పేరిట ఓ విలాసవంతమైన కారును తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధరే రూ.3.69 కోట్లు (ఎక్స్ షోరూమ్). 

సూపర్ కార్ కేటగిరీకి చెందిన ఈ కారును అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలరు. దీని స్పీడు, దీంట్లోని ఇంటీరియర్స్, దీని లుక్, స్టయిల్... ఇలా ఏది చూసినా వారెవ్వా అనిపించేలా ఉంటుంది. 

కానీ, భారత వ్యాపార దిగ్గజం, రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ సింఘానియాకు మాత్రం మాసెరాటి ఎంసీ20 ఓ చెత్త కారులా అనిపించిందట. ఈ విషయాన్ని ఆయనే తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. ఇంత దరిద్రగొట్టు కారును తన జీవితంలో నడపలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా మాసెరాటి ఎంసీ20 కారును కొనాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని సలహా కూడా ఇచ్చారు. 

"ఇది అత్యంత ప్రమాదకరమైన కారు అని నాకు గట్టి నమ్మకం. ఈ కారు నడిపేవాడు ఎప్పుడో ఒకప్పుడు దాంట్లోనే చస్తాడనిపిస్తుంది. భారత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవాలి" అంటూ గౌతమ్ సింఘానియా పేర్కొన్నారు. అయితే ఈ కారుతో తనకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

సింఘానియా విమర్శల పట్ల మాసెరాటి వర్గాలు స్పందించాయి. "అత్యంత కఠిన ప్రమాణాలకు లోబడి మా కారును తీర్చిదిద్దాం. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తయారైన కారు ఇది. అన్ని విధాలా తనిఖీ చేశాకే కారు కంపెనీ దాటి బయటికి వస్తుంది. సింఘానియా ఎత్తిచూపిన అంశాలపై మా సాంకేతిక నిపుణుల బృందం వెంటనే స్పందించింది. సింఘానియా వ్యక్తం చేసిన అభ్యంతరం కారు డిజైన్ కెపాసిటీకి సంబంధించిందిగా గుర్తించాం. ఏదేమైనా... మా ఉత్పాదనకు సంబంధించిన ఎలాంటి విషయాలను అయినా, ఫీడ్ బ్యాక్ ను అయినా మేం తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకుంటాం. కానీ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలం... మా కారుకు తిరుగులేదు. పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది" అంటూ మాసెరాటి ఓ ప్రకటన విడుదల చేసింది.
Gautam Singhania
Maserati MC-20
Super Car
Raymond
Italy

More Telugu News