Tamil Nadu: నీట్ రద్దు కోసం తమిళనాడు మంత్రుల నిరాహార దీక్ష

Tamil Nadu ministers begin day long hunger strike demanding abolition of NEET
  • ఒక్కరోజు దీక్షను ప్రారంభించిన మంత్రి ఉదయనిధి
  • విద్యార్థుల ఆత్మహత్యలకు ఈ పరీక్షే కారణమని ఫైర్
  • నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కేంద్రానికి డిమాండ్

వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని ఆ రాష్ట్ర మంత్రులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం ఒక్కరోజు దీక్షను మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ముందుగా నీట్ పరీక్షలో అర్హత సాధించలేమనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. విద్యార్థుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సహచర మంత్రులతో కలిసి నిరాహార దీక్షకు కూర్చున్నారు. చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాడు నిరాహార దీక్ష చేయాలంటూ డీఎంకే కార్యకర్తలకు ఉదయనిధి పిలుపునిచ్చారు. ఉదయనిధితో పాటు మంత్రులు, డీఎంకే సీనియర్ నేతలు దురైమురుగన్, పీకే శేఖర్ బాబు, మా సుబ్రమణియన్ తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు.

నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల నీట్ లో మూడో ప్రయత్నంలోనూ విఫలమైన ఓ విద్యార్థి ఉరేసుకుని చనిపోగా.. కొడుకు మృతదేహాన్ని చూసి తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీట్ పరీక్షపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తమైంది. కాగా, నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించేలా చేస్తామని, విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని స్టాలిన్ సర్కారు గతంలోనే హామీ ఇచ్చింది.

ఇందుకోసం అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. అయితే, ఈ బిల్లును గవర్నర్ ఆర్ ఎన్ రవి నిలిపివేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును నేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించింది. తమిళనాడు విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే ఈ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలంటూ రాష్ట్రపతిని అభ్యర్థించింది. ఈ విషయంలో కేంద్రాన్ని కూడా పలుమార్లు అభ్యర్థించింది. అయినా ఉపయోగం లేకుండా పోవడంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తాజాగా తమిళనాడు మంత్రులు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

  • Loading...

More Telugu News