YS Sharmila: పోలీసులకు హారతిచ్చి ఆందోళనకు దిగిన షర్మిల.. కేసీఆర్, పోలీసులపై తీవ్ర విమర్శలు!

Sharmila fires on BRS and police after she is house arrested
  • గజ్వేల్ పర్యటనకు వెళ్లకుండా షర్మిలను అడ్డుకున్న పోలీసులు
  • ప్రతి దానికి మీ పర్మిషన్ మాకెందుకని మండిపాటు
  • దళితులపై దాడి చేసిన బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న
దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనకు దిగిన బాధితులకు మద్దతుగా గజ్వేల్ పర్యటనకు బయల్దేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పర్యటనకు అనుమతి లేదని షర్మిలకు పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు హారతిచ్చి తనను బయటకు వెళ్లనివ్వాలని కోరారు. అయినా, పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె తన నివాసం లోటస్ పాండ్ వద్ద కింద బైఠాయించి ఆందోళనకు దిగారు. 

ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గజ్వేల్ పర్యటనతో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలుగుతుందని పోలీసులు చెపుతున్నారని... మీరు లా అండ్ ఆర్డర్ ను సృష్టించే వారిని అరెస్ట్ చేస్తారా? లేక ప్రజల తరపున కొట్లాడే వాళ్లను అరెస్ట్ చేస్తారా? అని పోలీసులను ప్రశ్నించారు. గజ్వేల్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు హౌస్ అరెస్ట్ చేశారా? అని నిలదీశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఉండొద్దని, ప్రజల కోసం ప్రతిపక్ష నేతలు కొట్లాడొద్దని మీరు చెపుతున్నారా? అని అడిగారు. 

అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం మణిపూర్ లో ఏమైనా చేసుకోవచ్చు, తెలంగాణలో తాలిబాన్ల మాదిరి పాలించుకోవచ్చని షర్మిల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ పెట్టడానికి పోలీసుల పర్మిషన్ కావాలా? ప్రజల తరపున కొట్లాడటానికి పర్మిషన్ కావాలా? అన్నిటికీ మీ పర్మిషన్ తీసుకుని చేసుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పర్మిషన్ మాకెందుకని ప్రశ్నించారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లోని తీగల గ్రామంలో దళితబంధు బాధితులపై దాడులకు దిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు కస్టడీలోకి తీసుకున్నారా? అని నిలదీశారు. దాడులు చేసేది బీఆర్ఎస్ నేతలైతే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? అని దుయ్యబట్టారు. 

తాను మాజీ ముఖ్యమంత్రి బిడ్డనని... ప్రజల తరపున కొట్లాడతానని షర్మిల చెప్పారు. తీగల గ్రామస్తులు తమకు అన్యాయం జరిగిందని, తమ తరపున పోరాడాలని తనకు లేఖ రాశారని... వారి విన్నపం మేరకే తాను అక్కడకు వెళ్తున్నానని అన్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు. మేము కొట్లాడటం తప్పా? లేక మీరు మమ్మల్ని అడ్డుకోవడం తప్పా? అని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో దళితుల తరపున శాంతియుతంగా పోరాడేందుకే తాము వెళ్తున్నామని చెప్పారు. తమ వద్ద రాళ్లు, కర్రలు లేవని... అక్కడకు వెళ్లి వారి బాధలు విని, వారి తరపున మీడియాతో మాట్లాడతామని అన్నారు. తన పర్యటనలో తనపై బీఆర్ఎస్ పార్టీవాళ్లు దాడి చేసినా తాము తిరగబడమని ప్రామిస్ చేస్తున్నానని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్లు తమపై కర్రలతో, రాళ్లతో దాడి చేశారని, తమ వాహనాలను తగలబెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు తమపై దాడి చేసినా, తమ వాహనాలను తగలబెట్టినా, ప్రజల తరపున పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పారు. తమ జీవితాలను బాగు చేసుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని... వైఎస్సార్ సువర్ణ పాలనను మళ్లీ తెచ్చేందుకే వచ్చానని తెలిపారు. రాజశేఖరరెడ్డి 46 లక్షల ఇళ్లను నిర్మించారని... కనీసం లక్ష ఇళ్లను నిర్మించడమైనా కేసీఆర్ కు చేతనయిందా? అని ప్రశ్నించారు.
YS Sharmila
YSRTP
Protest
House Arrest

More Telugu News