ISRO: ఇక గురి సూర్యుడిపైనే.. ‘ఆదిత్య ఎల్–1’తో సిద్ధమవుతున్న ఇస్రో!

ISRO to launch its first solar mission AdityaL1 to study Sun
షార్ట్స్‌లో చూడండి
అంతరిక్ష ప్రయోగాల్లో ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ సాగుతోంది ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ). 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును సాధించింది. ఇటీవల చేపట్టిన చంద్రయాన్–3తో తన లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమవుతోంది.

తొలిసారిగా సూర్యుడిపై అధ్యయనం కోసం ‘ఆదిత్య ఎల్‌–1’ మిషన్‌ను చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని ఈ రోజు ప్రకటించింది. ఆదిత్య ఎల్–1 మిషన్‌కు చెందిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య ఎల్–1 లాంచింగ్‌కు సిద్ధమవుతోంది” అని రాసుకొచ్చింది. బెంగళూరులో తయారైన శాటిలైట్‌ ఇప్పుడు శ్రీహరికోటకు చేరుకుందని తెలిపింది. 

ఈ ప్రయోగంలో భాగంగా సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. సౌర తుపాన్ల సమయంలో జరిగే మార్పులపై స్టడీ చేయనున్నారు. సూర్యుడి ఉపరితలాన్ని కూడా అధ్యయనం చేయనున్నారు. ఈ వ్యోమనౌక బరువు సుమారు 1,500 కిలోలు ఉంటుంది. ఆదిత్య ఎల్–1లో మొత్తం ఏడు పేలోడ్లు వుంటాయి. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. సెప్టెంబర్ తొలి వారంలో ఆదిత్య ఎల్–1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

సూర్యుడు–భూమి వ్యవస్థలో ఉన్న ఓ కక్ష్యలో శాటిలైట్‌ను ప్రవేశపెడుతారు. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం వల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది.
Go Back to Shorts
ISRO
Aditya L-1
first solar mission
Sriharikota
PSLV rocket

More Telugu News