Rahul Dravid: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు!

rahul dravid comments on batting depth in t20 series
  • టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్ ఆర్డర్ సమస్య కనిపించిందన్న ద్రవిడ్
  • కొన్ని విషయాల్లో మార్పులు చేయాల్సి ఉందని వ్యాఖ్య
  • తాము ఎక్కడ మెరుగు కావాలో తెలుసుకోగలిగామని వెల్లడి
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను 2–3 తేడాతో టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన చివరి టీ20 లో బ్యాట్స్‌మన్ విజృంభణతో విండీస్ ఈజీగానే గెలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌‌పై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్ ఆర్డర్ సమస్య కనిపించిందని అన్నాడు. 

బ్యాటింగ్ ఆర్డర్‌‌పై కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని ద్రవిడ్ చెప్పాడు. ఈ సిరీస్ సందర్భంగా బ్యాటింగ్ లైనప్‌ను తాము గమనించామని, కొన్ని విషయాల్లో మార్పులు చేయాలని తెలిపాడు. తాము ఎక్కడ మెరుగు కావాలో తెలుసుకోగలిగామని అన్నాడు. 

‘‘మా బౌలింగ్ మరీ బలహీనంగా ఏమీ లేదు. భవిష్యత్తులో మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. భారీ స్కోర్లు నమోదవుతునే ఉంటాయి. అయితే సరైన బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది” అని ద్రవిడ్ చెప్పాడు. విండీస్ జట్టులో అల్జారీ జోసెఫ్ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా భారీ షాట్లు ఆడతాడని, అందుకే మనకు బ్యాటింగ్‌ విషయంలో సవాళ్లు ఎదురయ్యాయని వివరించాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు విండీస్ గెలవగా.. తర్వాత రెండు టీమిండియా గెలిచింది. నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో మన బ్యాటింగ్ తడబడింది. సూర్యకుమార్ తప్ప ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మరో నాలుగు రోజుల్లో (18వ తేదీ నుంచి) ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ మొదలుకానుంది.
Rahul Dravid
Team India
west indies
batting lineup

More Telugu News