స్కూలుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని బెదిరించిన తల్లి.. కాలు జారడంతో బిగుసుకున్న ఉరి.. చెన్నైలో మహిళ మృతి
- బెదిరించే ప్రయత్నంలో ప్రమాదం.. ఆసుపత్రికి తరలించిన ఇరుగుపొరుగు
- చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి
- కోయంబత్తూరులోని అప్పనేకర్ రోడ్డులో ఘటన
తమిళనాడు, కోయంబత్తూరులోని అప్పనేకర్ రోడ్డులో సుధాకర్, యమునాబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు పదహారు, పద్నాలుగేళ్ల వయసున్న కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలిద్దరూ సమీపంలోని పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, కొన్నిరోజులుగా స్కూలుకు వెళ్లేందుకు కొడుకు మారాం చేస్తుండడంతో యమునాబాబు మందలించింది. బాగా చదువుకోవాలని చాలాసార్లు చెప్పిచూసింది. ఎంతకీ వినని కొడుకును దారికితెచ్చుకోవడానికి ఉరేసుకుంటానని బెదిరించింది.
దీనిని కొడుకు తేలిగ్గా తీసుకోవడంతో యమునాబాబు ఉరితాడు బిగించి, మెడకు తగిలించుకుంది. ఆపై కొడుకును బెదిరిస్తుండగా కాలు జారడంతో యమునాబాబు మెడకు ఉరి బిగుసుకుంది. కొడుకు పరిగెత్తుకు వెళ్లి చుట్టుపక్కల వాళ్లను పిలుచుకు రాగా.. ఉరితాడుకు వేలాడుతున్న యమునాబాబును వారు కిందికి దించి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో చనిపోయింది. దీంతో అప్పనేకర్ రోడ్డులో విషాదం నెలకొంది.