Andhra Pradesh: బొలెరోలో వచ్చి పందులను ఎత్తుకెళ్లిన దొంగలు.. అనంతపురంలో వింత చోరీ

Thieves Stole Pigs in Anantapur Andhra Pradesh Visuals Record in CCTV Camera
  • అర్ధరాత్రి వచ్చి 30 పందులను ఎత్తుకెళ్లిన వైనం
  • తెలిసిన వారి పనేనని గ్రామస్థుల అనుమానం
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాఫ్తు
ముసుగులు ధరించి బొలెరో వాహనంలో వచ్చిన దొంగలు పందులను ఎత్తుకెళ్లిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. చెడ్డీ గ్యాంగ్ తరహాలో చెడ్డీలు ధరించి అర్ధరాత్రి గ్రామంలోకి వచ్చారు. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి ముసుగులు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా అమిద్యాల గ్రామానికి చెందిన పుల్లమ్మ.. పందులను పెంచుకుంటూ జీవిస్తోంది. పందుల పెంపకానికి ఊరవతల రోడ్డు పక్కనే ఓ దొడ్డి ఏర్పాటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఎప్పట్లాగే పందుల దొడ్డికి వెళ్లిన పుల్లమ్మకు దొడ్లో పందులు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెతికిన పుల్లమ్మ.. చివరకు పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు విచారణ చేపట్టి గ్రామ శివార్లలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు పందులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దొడ్డిలోని 30 పందులను దొంగలు రోడ్డుపైకి తోలుకొచ్చి, బొలెరోలో ఎక్కించి తీసుకెళ్లారు. బొలెరో వాహనం నెంబర్ గుర్తించిన పోలీసులు.. ఆ నెంబర్ ఆధారంగా వాహనం యజమానిని, దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ దొంగతనానికి పాల్పడింది తెలిసిన వారే అయి ఉంటారని గ్రామస్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
Anantapur
Pigs
Thieves
CCTV Camera

More Telugu News