Luna-25: చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపిన రష్యా.. ఇస్రో కంటే 2 రోజుల ముందే జాబిల్లిపై ల్యాండింగ్

Russia Sends Spacecraft To Moon Weeks After Chandrayaan 3 Launch
షార్ట్స్‌లో చూడండి
దాదాపు అర్ధశతాబ్దం క్రితం అంతరిక్ష రంగంలో అగ్రగామిగా వెలుగొందిన రష్యా మరోసారి తన సత్తా ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు చంద్రయాన్ తరహాలో తాజాగా 'లూనా-25' వ్యోమనౌకను ప్రయోగించింది. రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.00 గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25ను తీసుకుని వెళుతున్న రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికెగసింది. 

రష్యా అంతరీక్ష సంస్థ రాస్‌కాస్మొనాస్ ప్రకటన ప్రకారం, మరో ఐదు రోజుల్లో ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యను చేరుకుంటుంది. అనంతరం, జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజుల పాటు అన్వేషించిన అనంతరం చంద్రుడిపై దిగుతుంది. ఆగస్టు 21న ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగే అవకాశం ఉందని రాస్‌కాస్మొనాస్ నిపుణుల పేర్కొన్నారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాది పాటు ఈ వ్యోమనౌక చంద్రుడిపై ప్రయోగాలు చేపడుతుంది. జాబిల్లిపై మట్టిని సేకరించి పరీక్షిస్తుంది. అనేక దీర్ఘకాలిక పరిశోధనలు కూడా చేపడుతుందని రష్యా అంతరిక్ష సంస్థ పేర్కొంది. సోవియట్ యూనియన్ అనంతర కాలంలో రష్యా ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి అని అక్కడి నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. 

రష్యా అంతరిక్ష రంగానికి కొత్త ఊపు ఇవ్వడంతో పాటూ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఒంటరవుతున్న దేశంలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ప్రయోగం జరుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కూడా జాబిల్లి వైపు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇస్రో ప్రణాళిక ప్రకారం చంద్రయాన్-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతుంది. మరోవైపు, లూనా-25ని విజయవంతంగా ప్రయోగించిన రాస్‌కాస్మొనాస్‌ను అభినందిస్తూ ఇస్రో ట్వీట్ చేసింది.
Go Back to Shorts
Luna-25
Russia
Roscosmonos
ISRO

More Telugu News