Breast Cancer: పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్... ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Breast Cancer in men and its symptoms
  • మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్
  • పురుషుల్లోనూ అరుదుగా కనిపించే రొమ్ము క్యాన్సర్
  • ప్రతి 1000 మంది పురుషుల్లో ఒకరు దీని బారినపడే అవకాశం
  • ముందుగా గుర్తించడమే చాలా ముఖ్యం 
రొమ్ము క్యాన్సర్... ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో చాలామందిని కబళించే క్యాన్సర్లలో ఇది ముఖ్యమైనది. మహిళలే కాదు, పురుషుల్లోనూ కొందరు రొమ్ము క్యాన్సర్ బారినపడుతుంటారు. ప్రతి 1000 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బాధితులు అయ్యే అవకాశం ఉందని గురుగ్రామ్ కు చెందిన ఆన్ క్వెస్ట్ ల్యాబొరేటరీ మాలిక్యులర్ బయాలజీ అధిపతి డాక్టర్ వినయ్ భాటియా వెల్లడించారు. 

అయితే మహిళలకు మమ్మోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా రొమ్ము క్యాన్సర్ ను ముందే పసిగట్టే అవకాశం ఉండగా, పురుషులకు నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన ముందస్తు పరీక్షలు దాదాపుగా లేవనే చెప్పాలి. 

దాంతో, పురుషులు తమ రొమ్ము కణజాలంలో జరిగే మార్పులను గుర్తించలేక, అవి సాధారణమైన మార్పులే అనుకుని బ్రెస్ట్ క్యాన్సర్ మరింత ముదిరిపోయే ప్రమాదం తెచ్చుకుంటున్నారని డాక్టర్ వినయ్ భాటియా వివరించారు. 

పురుషుల్లో 60-70 ఏళ్ల వయసున్న వారిలో రొమ్ము క్యాన్సర్ కేసులు అత్యధికం. కుటుంబ గత చరిత్రను పరిశీలిస్తే, ఆ కుటుంబంలోని మహిళలు ఎవరైనా రొమ్ము క్యాన్సర్ కు గురైతే, ఆ కుటుంబంలోని పురుషులు రొమ్ము క్యాన్సర్ బారినపడే అవకాశాలు ఉంటాయి. 

మహిళలకు మాదిరే రొమ్ము భాగంలో గడ్డలు ఏర్పడతాయి. రొమ్ము బుడిపెల నుంచి రక్తం కారడం, ఇతర స్రావాలు బయటికి రావడం, రొమ్ము బుడిపెలు కుచించుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు, రొమ్ము పక్కన ఉండే చర్మంలో మార్పులు, నొప్పి వంటి అదనపు లక్షణాలు పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ కు సంకేతాలు. 

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలి. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ను గుర్తించేందుకు పూర్తిస్థాయి శారీరక పరీక్షలు, ఎక్స్ రే, బయాప్సీ, హిస్టోపాథాలనీ, హార్మోన్ రిసెప్టర్ పరీక్షలు నిర్వహిస్తారు.
Breast Cancer
Men
Symptoms

More Telugu News