Rahul Gandhi: పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్.. మండి పడ్డ మంత్రి స్మృతీ ఇరానీ

Rahul Gandhi Allegedly Blows Flying Kiss To Smriti Irani While Leaving Lok Sabha
  • పార్లమెంట్ నుంచి వెళుతూ రాహుల్ చేసినట్టు ఆరోపణ
  • తాను నిశ్చేష్టురాలిని అయ్యానన్న కేంద్ర మంత్రి ఇరానీ
  • స్త్రీద్వేషి అయితేనే అలా చేస్తారంటూ మండిపాటు
పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం అనంతరం రాహుల్ చేసిన ఓ చర్య వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, మంగళవారం నుంచి దీనిపై లోక్ సభలో చర్చ నడుస్తోంది. బుధవారం దీనిపై మాట్లాడే అవకాశం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి వచ్చింది. ఈ సందర్భంగా మణిపూర్ లో శాంతి స్థాపన చేయడంలో కేంద్ర సర్కారు విఫలమైందంటూ ఆయన దుయ్యబట్టారు.

ప్రసంగం ముగిసిన అనంతరం బీజేపీ మహిళా ఎంపీల వైపు చూస్తూ రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్లిపోయినట్టు ఆరోపణ. ఇది కెమెరాల్లో రికార్డు కాలేదు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వైపు చూసి ఇచ్చినట్టు కూడా కథనాలు వచ్చాయి. రాహుల్ చేసిన ఆరోపణలకు మంత్రి స్మృతీ ఇరానీ సభలో సమాధానం ఇస్తున్న తరుణంలో ఇది జరిగింది. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి బయటకు వెళ్లే క్రమంలో చేతిలోని ఫైల్స్ కింద పడిపోయాయి. వాటిని తీసుకునేందుకు రాహుల్ గాంధీ కిందకు వంగిన సమయంలో బీజేపీ ఎంపీలు కొందరు నవ్వులు చిందించారు.

పైకి లేచిన రాహుల్ బీజేపీ ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్లిపోయారన్నది ఆరోపణ. దీనిపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఘాటుగా స్పందించారు. రాహుల్ ను స్త్రీద్వేషిగా అభివర్ణించారు. ‘‘నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఆయన తప్పుగా ప్రవర్తించాడు. స్త్రీలను ద్వేషించే వ్యక్తే మహిళా పార్లమెంటేరియన్లకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలడు. ఓ కుటుంబం నుంచి వచ్చిన ప్రతినిధిగా (గాంధీ కుటుంబం).. తాను తన పార్టీ మహిళల గురించి ఎలా భావిస్తుందో చూపించాడు. ఆయనకు చైనాతో సంబంధాలు కలిగి ఉండడం తప్పించి, భారత్ కు చేసిందేమీ లేదు’’ అని ఇరానీ రాహుల్ తీరును ఎండగట్టారు. రాహుల్ చేసిన చర్యపై బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.
Rahul Gandhi
Flying Kiss
bjp mps
Smriti Irani
Lok Sabha

More Telugu News