YV Subba Reddy: హత్య చేసిన వాలంటీర్ ను ఎప్పుడో తొలగించారు.. పవన్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు: వైవీ సుబ్బారెడ్డి

Volunteer who murdered woman already terminated from services says YV Subba Reddy
  • వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారో పవన్ కు కూడా తెలియదన్న వైవీ సుబ్బారెడ్డి
  • వైసీపీ దరిదాపుల్లోకి కూడా ఏ పార్టీ రాదని వ్యాఖ్య
  • గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి టీడీపీ నేతలకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్న
విశాఖలో ఓ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో వాలంటీర్ వ్యవస్థపై విపక్ష నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ అంశంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... హత్యపై విచారణ చేస్తే... నిందితుడిని వాలంటీర్ విధుల నుంచి ఎప్పుడో తొలగించినట్టు తేలిందని చెప్పారు. ఈ విషయం తెలిసి విపక్ష నేతలు సైలెంట్ అయిపోయారని ఎద్దేవా చేశారు. 

వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నాడో జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా తెలియదని సుబ్బారెడ్డి అన్నారు. పవన్ ను ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఈ నెల 9 నుంచి వారాహి యాత్ర ప్రారంభం కాబోతోందనే విషయంపై మాట్లాడుతూ... ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ఒరిగేది ఏమీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దరిదాపుల్లోకి కూడా ఏ పార్టీ వచ్చే అవకాశమే లేదని చెప్పారు. 

ఏపీలో గత నాలుగేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదని సుబ్బారెడ్డి విమర్శించారు. విశాఖలో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు గురించి టీడీపీ నేతలకు నోరు ఎందుకు పెగలడం లేదని ప్రశ్నించారు. శిలాఫలకాలతో ఆగిపోకుండా... అనుకున్న సమయానికి ప్రతి పని పూర్తి కావాలన్నదే జగన్ సంకల్పమని చెప్పారు.
YV Subba Reddy
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena
Telugudesam

More Telugu News