Spike: ఇజ్రాయెల్ నుంచి భారత్ కు 'స్పైక్' మిస్సైళ్లు... ఎక్కడ దాగినా వెంటాడతాయి!

India gets anti tank Spike missile from Israel
  • స్పైక్ క్షిపణులు ప్రధానంగా యాంటీ టాంక్ క్షిపణులు
  • గగనతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే మిస్సైళ్లు
  • పర్వతాల చాటున నక్కి దాడులు చేసే శత్రువుల పనిబట్టే భీకర అస్త్రాలు
శత్రువులు ఎత్తయిన పర్వతాల మాటున దాగి, యుద్ధ టాంకులతో భారత్ పై దాడులు చేయడం ఇక కుదరదు! శత్రువులు ఎక్కడ దాగినా వెతికి మరీ మట్టుబెట్టే ఇజ్రాయెల్ తయారీ స్పైక్ క్షిపణులు ఇప్పుడు భారత్ అమ్ములపొదిలో చేరాయి. 

ఇజ్రాయెల్ తన అత్యాధునిక స్పైక్ ఎన్ఎల్ఓఎస్ (నాన్ లైన్ ఆఫ్ సైట్) మిస్సైళ్లను భారత వాయుసేనకు అందించింది. ఇవి ప్రధానంగా యాంటీ టాంక్ మిస్సైళ్లు. గగనతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాల పైకి వీటిని ప్రయోగిస్తారు. 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా ఛేదిస్తాయి.

త్వరలోనే ఈ ఇజ్రాయెల్ క్షిపణులను భారత రక్షణ శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. అనంతరం వాటిని భారత వాయుసేనకు అప్పగిస్తారు. ఈ స్పైక్ క్షిపణులను రష్యా తయారీ ఎంఐ-17వీ5 హెలికాప్టర్లకు అమర్చనున్నారు. 

రెండేళ్ల కిందట చైనా వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా యుద్ధ ట్యాంకులను మోహరించింది. దాంతో చైనాను నిలువరించాలంటే స్పైక్ క్షిపణులు తప్పనిసరి అని భారత వాయుసేన ఆ సమయంలోనే నిర్ణయించుకుంది. 

కాగా, ఇజ్రాయెల్ ఈ క్షిపణులను పరిమిత సంఖ్యలోనే అందించగా, వీటిని పెద్ద సంఖ్యలో భారత్ లోనే మేకిన్ ఇండియా ప్రాతిపదికన తయారు చేసే అవకాశాలున్నాయి.
Spike
Anti Tank Missile
India
Israel

More Telugu News